- ఈ ప్రాజెక్టును కోర్టుల్లో అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ రెడ్డే
- డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అయితున్నా మౌనం ఎందుకు?
- సొంత శాఖపై పట్టు లేదు.. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారో!
- అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: 90 టీఎంసీల పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 45 టీఎంసీలకు ఎట్ల ఒప్పుకున్నరని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఉత్తమ్ కు సీఎం రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందని, అందుకే ఆయన అన్నీ ఉత్త మాటలే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కు రేవంత్ గాలి గట్టిగా సోకినట్లుందని, అందుకే తన సొంత శాఖపై పట్టులేక అసత్యాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై హరీశ్ సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నీటి కేటాయింపులపై మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘‘90 టీఎంసీల నీటిని 45 టీఎంసీలకు తగ్గించారా లేదా? అన్నది ఉత్తమ్ స్పష్టం చేయాలి. డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది గడుస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నది? కొడంగల్–నారాయణపేట లిఫ్ట్ కు రెండేండ్ల కింద కొబ్బరికాయ కొట్టారు.. మరి ఇప్పటి వరకు డీపీఆర్ ఎందుకు పంపలేదు? సొంత శాఖపై మంత్రిగా ఉత్తమ్ కు ఇంకా పట్టు రానట్టుంది. ఆయన ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటాడో?’’ అని అన్నారు.
‘‘మిస్టర్ ఉత్తమ్.. మీ చేతకాని తనాన్ని మాపై రుద్దుతారా? పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్ లో, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్న ద్రోహివి నువ్వు కాదా? పాలమూరు ప్రాజెక్టు కోసం నేను నేల మీద పడుకుని పనిచేశాను. ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం.
ప్రాజెక్టులోని రెండు టన్నెల్స్ పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ హయాంలో 3 డీపీఆర్‌లు వాపస్ వచ్చాయి. మా హయాంలో ఏడు ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి ఫైనల్ అనుమతులు తెచ్చాం. మరి మీరు ఈ రెండేళ్లల్లో ఒక్క అనుమతి అయినా తెచ్చారా?” అని హరీశ్ పేర్కొన్నారు.
అనుమతులు తేవడం చేతకాక..
ఎస్ఎల్‌బీసీ సొరంగం పనులపై బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1900 కోట్లు ఖర్చు పెట్టి పనులు ముందుకు తీసుకెళ్లిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్లనే ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.
