- ఏపీకే ఫైల్స్‌తో మాల్‌వేర్ లింకులు
- అలర్ట్‌గా ఉండాలన్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లు కొత్త సంవత్సర వేడుకలను టార్గెట్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో శుభాకాంక్షలు, బహుమతులు, ఆఫర్లు అంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు, ఎస్‌ఎంఎస్‌లలో లింక్‌లు పంపుతున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) హెచ్చరించింది. ఇయర్ ఎండింగ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు, న్యూ ఇయర్ గిఫ్ట్‌లు, ప్రయాణ రాయితీలు, ఈవెంట్ టికెట్లు వంటి పేర్లతో లింకులు పంపిస్తున్నారని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ సోమవారం ప్రకటనలో తెలిపారు.
శుభాకాంక్షలు చూడండి, ఆఫర్ పొందండి లేదా బహుమతి స్వీకరించండి అంటూ మేసేజ్‌లు పంపించి.. లింక్‌పై క్లిక్ చేయమని ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. అలాంటి లింకులపై క్లిక్ చేసిన వెంటనే బాధితుడి మొబైల్ ఫోన్‌లో అనుమానాస్పద ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్ ఇన్‌స్టాల్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ మాల్‌వేర్‌తో ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, కాంటాక్ట్స్, ఫోటోలు, వాట్సాప్ ఖాతాలపై కంట్రోల్ అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని తెలిపారు.
ఇలాంటి హానికరమైన లింకులు స్నేహితులు, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫార్వార్డ్ అవుతుండటంతో బాధితుల సంఖ్య పెరుగుతోందని శిఖాగోయల్ వెల్లడించారు. సైబర్ మోసాల గురైనవాళ్లు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
లింకులపై క్లిక్ చేయవద్దు..
- వాట్సాప్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా వచ్చే శుభాకాంక్షలు, బహుమతులు, ఆఫర్ లింకులపై క్లిక్ చేయొద్దు.
- మెసేజింగ్ ప్లాట్‌ఫాంల ద్వారా పంపే యాప్‌లు, అప్‌డేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్‌స్టాల్ చేయొద్దు.
- ఓటీపీలు, పిన్ నంబర్లు, సీవీవీ, వెరిఫికేషన్ కోడ్‌లను ఎవరికీ చెప్పొద్దు.
- వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసి, యాప్‌లను అధికారిక యాప్ స్టోర్ల ద్వారానే అప్‌డేట్ చేయాలి.
- లింకులపై క్లిక్ చేస్తే వెంటనే మొబైల్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ నిలిపివేయాలి.
- అనుమానాస్పద యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేయాలి.
