- నీళ్ల సెంటిమెంట్ తో రాజకీయ లబ్ధికి కుట్ర: రాంచందర్ రావు
- పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్‌తో భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు నీళ్ల సెంటిమెంట్‌ను వాడుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో ఆ రెండు పార్టీలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయని విమర్శించారు.
ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రతిపక్షనేతగా ఉన్న కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాంచందర్ రావు సోమవారం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ సంస్థాగత అంశాలు, సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు.
అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీని కేవలం 2 రోజులు నిర్వహించి వాయిదా వేయడం సరికాదు. ప్రజా సమస్యలపై చర్చించకుండా తప్పించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కనీసం 30 రోజులు అసెంబ్లీ నిర్వహించాలి. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలపై సభలో చర్చ జరగాలి. జనవరిలో నితిన్ నబీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు’’అని రాంచందర్ రావు వెల్లడించారు.
ఆ రెండు పార్టీలే అన్యాయం చేసినయ్
నీళ్ల వాటాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని రాంచందర్ రావు దుయ్యబట్టారు. ‘‘కృష్ణా, గోదావరి జలాల విషయంలో రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయి. కాంగ్రెస్ హయాంలో విభజన చట్టంతో రాష్ట్రానికి అన్యాయం జరిగితే.. కేసీఆర్ 299 టీఎంసీలకు సంతకం చేసి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు’’అని రాంచందర్ రావు అన్నారు.
లీకు వీరులు.. వీక్ అవుతారు..
బీజేపీలోని లీక్ వీరులు.. వీక్ అవుతారని రాంచందర్ రావు అన్నారు. ‘‘ మోదీతో జరిగిన సమావేశంలో నేను లేను. బీజేపీ లీడర్ల మధ్య విభేదాల్లేవు. అందరూ ఐక్యంగానే ఉన్నరు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. గతంలో 165 సర్పంచ్ అభ్యర్థులు గెలిస్తే.. ఈసారి 800 సర్పంచ్‌లు... 1500 ఉప సర్పంచ్‌లు, 10వేల వార్డు మెంబర్లు విజయం సాధించారు’’అని రాంచందర్ రావు తెలిపారు.
