- ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ యువత టాలెంట్‌కు గొప్ప వేదిక
- రవీంద్రభారతిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో సోమవారం "బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్" అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.ఇందులో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, టూరిజం-కల్చర్-ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరై, విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.." దేశంలో ఎక్కడా లేని విధంగా బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరుతో అవార్డులు ఇస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ ఎలా చేరుతున్నాయో చెప్పే బాధ్యతను యువ ఫిల్మ్ మేకర్ల చేతుల్లో పెట్టాం.
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అనేది యువత మేధస్సుకు, సృజనాత్మకతకు ఒక గొప్ప వేదిక. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ఎంట్రీలను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఒక చైతన్యవంతమైన వారధిలా నిలిచారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క యంగ్ ఫిల్మ్ మేకర్ కు నా హృదయపూర్వక అభినందనలు" అని పేర్కొన్నారు. కాగా, తెలంగాణలో సినిమాలు తీసుకోవడానికి లోకేషన్స్ పరంగా కూడా టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు.
