మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. 2 వేల 996 వార్డులు ఫైనల్

మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. 2 వేల 996 వార్డులు ఫైనల్
  • మున్సిపల్​ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. 
  • సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్
  • జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన
  • జనవరి 5న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆల్ పార్టీ మీటింగ్స్​
  • 10న వార్డులవారీగా ఓటర్ల జాబితా ఫైనల్ లిస్ట్​
  • గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు.. 6 కార్పొరేషన్లలో ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో మంచి ఊపుమీదున్న ఆ పార్టీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్​ ఎన్నికలకు రెడీ అవుతున్నది. సర్కారు నుంచి వచ్చిన ఆదేశాలతో.. ఇప్పటికే గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు అటు మున్సిపల్ శాఖ, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. 

ఈ క్రమంలో మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​ శాఖ నుంచి 2,996 వార్డుల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డులవారీగా ప్రాథమిక ఓటర్ల జాబితా రెడీ చేస్తున్నది. నేడు(మంగళవారం) మున్సిపాలిటీల వారీగా పోలింగ్ స్టేషన్లను ప్రకటించనున్నది. అలాగే జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించనున్నది.

జనవరి 5న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో, 6న కలెక్టరేట్లలో ఆల్ పార్టీ మీటింగ్స్ నిర్వహిస్తారు. అనంతరం జనవరి 10న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డులు, పోలింగ్ స్టేషన్ల ప్రకారం ఫైనల్ ఓటర్​లిస్టులు ప్రకటిస్తారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని నోటిఫికేషన్ జారీ చేశారు.

2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్​1, 2025 వరకు అసెంబ్లీ నియోజకవర్గం వారీగా నమోదు చేసిన ఓటర్ల జాబితాను అనుసరించి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా​ ఓటర్ల జాబితా రెడీ చేస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ప్రకటించింది.

123 చోట్ల పాలక వర్గాలకు ముగిసిన గడువు..
జీహెచ్ఎంసీ చుట్టూ ఔటర్​ రింగ్ రోడ్డు లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఇటీవల గ్రేటర్​ హైదరాబాద్​లో ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ పరిధిలో 124 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్​(జీహెచ్​ఎంసీ) పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూర్, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల పాలవర్గాల గడువు వచ్చే ఏడాది మే వరకు ఉన్నది.

ఇవి కాక మందమర్రి, మణుగూరు మున్సిపాలిటీలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నవి. ఈ పది చోట్ల మినహా ఇంకా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. ఈ 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సర్కారు నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా  అధికారులు అన్ని ఏర్పాట్లు  చేస్తున్నారు.

2,996 వార్డులు ఫైనల్​
కాగా గడువు ముగిసిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2,996 వార్డులను మున్సిపల్ శాఖ ఆఫీసర్లు గుర్తించారు. వార్డుల సరిహద్దులను ఫైనల్ చేశారు. 117 మున్సిపాలిటీలల పరిధిలో 2,630 వార్డులు, కరీంనగర్​, మహబూబాబ్ నగర్​, మంచిర్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో 366 వార్డులున్నట్లుగా మున్సిపల్ శాఖ ఆఫీసర్లు ప్రకటించారు. 

ఎస్ఈసీ నుంచి ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ షెడ్యూల్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ నుంచి ఎన్నికలు నిర్వహించబోయే 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందింది. వీటిలో 2,996 వార్డులుండగా వార్డులవారీగా ఓటర్లు జాబితా రెడీ చేస్తున్నారు.

ఎస్ఈసీ అసెంబ్లీ ఎలక్టోరల్ రోల్స్ ఆధారంగా మున్సిపాలిటీల వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, అప్‌‌‌‌డేట్, ప్రచురణ లాంటి పనులకు సిద్దమైంది. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ రాణికుమిదిని పోలింగ్​స్టేషన్లు, ఓటర్ల జాబితాకు సంబంధించిన నోటిఫికేషన్​ షెడ్యూల్​ ప్రకటించారు.

మొదలైన ప్రీ ఎలక్షన్​ వర్క్స్
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితా వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేయడంతో ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మున్సిపల్ శాఖ ఆఫీసర్లు చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్​పై నిర్వహించే అవకాశాలున్నట్లుగా తెలిసింది. దీనికి తగినట్లుగానే ఆఫీస్​కు సంబంధించిన స్టేషనరీ, పేపర్ ముద్రణ కోసం ఆయా కార్యాలయాలకు ఆర్డర్​ పంపించారు. ఇండెలిబుల్ ఇంక్, పోలింగ్ కిట్స్ వంటి మెటీరియల్ సేకరణకు ఆర్డర్స్ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్ల వంటి నియామకం కోసం ఉద్యోగుల జాబితా సిద్ధం చేస్తున్నారు. 

షెడ్యూల్:
* ఈ నెల 30వ తేదీన 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో ఈసీఐ పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తారు.
* 31న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారిగా పోలీంగ్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తారు.
* జనవరి 1, 2026న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా ఉన్న ఓటర్ల జాబితా ప్రకటిస్తూ నోటీస్​ బోర్డులపై అంటిస్తారు. ఐదు రోజుల పాటు అబ్జెక్షన్స్ స్వీకరిస్తారు.
* జనవరి 5న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆల్ పార్టీ మీటింగ్స్ నిర్వహిస్తారు.
* జనవరి 6న జిల్లా కలెక్టరేట్లలో అన్నీ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ జరపుతారు.
* జనవరి 10న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డులు, పోలింగ్ స్టేషన్ల ప్రకారం ఫైనల్ ఓటర్​ లిస్ట్ ప్రకటిస్తారు.