సంతాప తీర్మానం టైంలో వెళ్లిపోవడమేంది? : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సంతాప తీర్మానం టైంలో వెళ్లిపోవడమేంది? : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  •     కేసీఆర్ తీరుపై మంత్రి వెంకట్ రెడ్డి అసంతృప్తి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కోసం పోరాడిన మాజీ ఎమ్మెల్యేలకు సభలో సంతాప తీర్మానం చదివే సమయంలో అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత కేసీఆర్ వెళ్లిపోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం లాబీలో మీడియాతో మంత్రి చిట్ చాట్  చేశారు. 

మరణించిన సభ్యులకు సభలో సంతాపం ప్రకటించిన సమయంలో కేసీఆర్ ఉంటే ప్రతిపక్ష నేతగా ఆయనకు హుందాగా ఉండేదన్నారు. తాను కూడా అసలైన తెలంగాణ ఉద్యమకారుడినని, కేసీఆర్  ఆస్పత్రిలో దీక్ష చేస్తే.. తాను రోడ్లపై దీక్ష చేశానని గుర్తుచేశారు. 

అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు కేసీఆర్  సభకు రావడం సంతోషమే అయినా... ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం ఏమాత్రం బాలేదన్నారు. ప్రతిపక్ష నేతగా సభకు కొంత సమయం కేటాయించి ఉండాల్సిందన్నారు. కాగా.. సభలో కేసీఆర్ ను కలిసి ఆరోగ్యం ఎలా ఉందని అడిగానని, ప్రతిగా ఆయన కూడా తన ఆరోగ్యం గురించి అడిగారని కోమటిరెడ్డి చెప్పారు.