వంద కోట్ల నిధులిస్తామంటిరి.. ఇంకా వీసీనే నియమించలేదు: ఏబీవీపీ

వంద కోట్ల నిధులిస్తామంటిరి.. ఇంకా వీసీనే నియమించలేదు: ఏబీవీపీ

హైదరాబాద్: తెలంగాణ తొలి మహిళా వర్సిటీకి నిధులివ్వకుండా.. కనీసం రెగ్యులర్ వీసీనైనా నియమించకుండా నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థినులు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీ కాగితాలకే పరిమితం అయిందని ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ కోఠిలోని యూనివర్సిటీ ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీ అంటూ ఆర్భాటంగా ప్రకటించి..వంద కోట్ల నిధులు కేటాయిస్తున్నామన్న హామీ ఇంత వరకు ఆచరణలోకి రాలేదని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా కనీసం వీసీని నియమించలేదని నిలదీశారు. 

ఆందోళన నిర్వహించిన సందర్భంగా  మీడియాతో మాట్లాడిన ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్ సురేష్  ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మించి మోసం చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. తెలంగాణలో  విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పి ఆచరణలో ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నెలలు గడుస్తున్న ఇప్పటికీ మహిళా యూనివర్సిటీ  ప్రకటన కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు.

కోఠి ఉమెన్స్ కళాశాల ఇవాళ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. కొత్తగా అడ్మిషన్ పొందిన పీజీ విద్యార్థినులు హాస్టల్ సౌకర్యం లేక తరగతులు ప్రారంభమై వారం రోజులైనా ఒక్కరు కూడా ఇప్పటివరకు తరగతులకు హాజరు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు . అదేవిధంగా విద్యార్థులందరికీ సరిపడా నూతన హాస్టల్ బిల్డింగ్ ని నిర్మించి మౌళిక సదుపాయాలతోపాటు విద్యార్థులకు ల్యాబ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి తన మొద్దు నిద్రను వీడి మహిళా యూనివర్సిటీ కి వీసీని నియమించడంతోపాటు 100 కోట్ల నిధులను విడుదల చేయకపోతే వాటిని సాధించే వరకు ఏబీవీపీ  ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కళాశాల ప్రెసిడెంట్ సోనీ, నగర కార్యదర్శి నితిన్ ,  సిరి వెన్నెల, ఆశ, శ్రావణి, కృష్ణవేణి, వెన్నెల, లావణ్య, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు .