- ఫుడ్‌సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు
- క్యాంటిన్, సెక్యూరిటీ, మెడికల్ షాప్ కాంట్రాక్ట్‌లపై ఆరా
- ఇద్దరికే కాంట్రాక్టులు కట్టబెట్టిన నిమ్స్ ఉన్నతాధికారులు
- అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లోనూ అవకతవకలు గుర్తింపు
- పలు రికార్డులు సీజ్.. ఇవాళా కొనసాగనున్న తనిఖీలు
హైదరాబాద్/పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ హాస్పిటల్‌లో క్యాంటిన్లు, మెడికల్ షాప్స్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలు, టెండర్ల కేటాయింపుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. హాస్పిటల్‌లోని క్యాంటిన్, మెడికల్ స్టోర్స్ సహా నాలుగు ప్రైవేట్ సర్వీస్‌లకు సంబంధించిన అవకతవకల చిట్టా విప్పుతోంది. ఈ మేరకు ముగ్గురు డీఎస్పీలతో కూడిన ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌తో పాటు డ్రగ్‌కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ విభాగాలకు చెందిన దాదాపు 35 మందికి పైగా అధికారులు గురువారం నిమ్స్‌లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. రెండు క్యాంటిన్‌లు సహా మెడికల్, సర్జికల్స్ స్టోర్, క్యాంటిన్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లో తనిఖీలు చేశారు. బోర్డ్ రూమ్‌లో రికార్డులను పరిశీలించి, అనుమానాస్పదంగా ఉన్నవాటిని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సిబ్బందిని విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.
ఏళ్లుగా ఒకే వ్యక్తికి క్యాంటిన్ నిర్వహణ
నిమ్స్ పరిసరాల్లోని తాజ్ బెల్సన్ క్యాంటిన్ సుమారు 16 ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతి రెండేళ్లకోసారి టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్‌కు నిర్వహణ అప్పగించాల్సి ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఏళ్లుగా ఒకే వ్యక్తి పేరుతో నడుస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెయిన్ గేట్ వద్ద మరో క్యాంటిన్ సుమారు 40 ఏళ్లుగా కొనసాగుతోంది. అధికారులతో కుమ్మక్కై నామమాత్రపు రుసుము చెల్లిస్తున్నారనే ఆరోపణలపైనా విచారణ జరుగుతోంది. నిమ్స్ అధికారులపై వచ్చిన అవినీతి ఫిర్యాదులు, నిధుల మళ్లింపు ఆరోపణలపైనా ఏసీబీ ఆరా తీస్తోంది.
2014 నుంచి ఫైళ్ల పరిశీలన
అవినీతి ఆరోపణలతో నిమ్స్ మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌ను ఇటీవల ఏసీబీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో క్యాంటిన్లు, మెడికల్ షాపుల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. 2014 నుంచి జరిగిన కాంట్రాక్టులు, కొనుగోళ్లకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తూ లోతుగా విచారణ జరుపుతున్నారు. నలుగురు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల బృందం సర్జికల్ స్టోర్‌లో అత్యవసర వైద్య పరికరాలు, స్టెంట్లు, ఆపరేషన్ సామగ్రి, ఔషధాల కొనుగోలు రికార్డులను సరఫరా బిల్లులతో సరిపోల్చి పరిశీలించినట్లు తెలిసింది. కొన్ని ఫైళ్లను మాయంచేయడంతో పాటు పలు ఫైళ్లల్లో పేజీలను చింపేసి ఆధారాలు దొరకకుండా చేసినట్టు అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరో నలుగురు ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు క్యాంటిన్లలో నాణ్యత, పరిశుభ్రత, టెండర్ నిబంధనల ఉల్లంఘనలపై ఆధారాలు సేకరిస్తున్నారు. లక్ష్మీ భాస్కర్ అరెస్టుతో మొదలైన విచారణలో మరికొందరు మాజీ అధికారులు, ఉద్యోగుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మందుల మళ్లింపుపైనా విచారణ
నిమ్స్ నిధుల దుర్వినియోగం, టెండర్లు, మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అవకతవకలను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున మందులు దారి మళ్లించినట్లు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఆయా సమయాల్లో విధులు నిర్వహించిన అధికారుల వివరాలనూ సేకరించింది. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన సెక్యూరిటీ సర్వీస్, మెడికల్ షాపుల టెండర్ల రికార్డులను పరిశీలించింది. మరోవైపు, రోగులు, అటెండర్లు, సిబ్బందికి అందించే ఆహార నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసి శాంపిల్స్ సేకరించారు. సోదాలు పూర్తయ్యాక మూడు విభాగాల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నారు.
