డెలివరి బాయ్ గా మారిన ఆఫ్ఘనిస్తాన్ మాజీ మంత్రి 

డెలివరి బాయ్ గా మారిన ఆఫ్ఘనిస్తాన్ మాజీ మంత్రి 

పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని చూస్తుంటే సాధారణ డెలివరి బాయ్ లా కనిపిస్తున్నాడు కదూ. అవును నిజమే. పిజ్జా డెలివరి బాయ్. కానీ ఆయన గతంలో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ఐటీ మరియు కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేసిన సయ్యద్‌ అహ్మద్‌ సాదత్‌.  మొహానికి మాస్క్ పెట్టుకుని ఉండడంతో తెలిసిన వారైతే తప్ప గుర్తుపట్టలేని విధంగా కనిపిస్తున్న ఫోటోను చూపించి మాజీ మంత్రి అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారనుకుంటే పొరపాటే.

మన ఇండియాలో డెలివరీ బాయ్ లు చాలా మందికి బైకులు ఉన్నాయి. ఈ వ్యక్తి బైకు కూడా లేదు. సైకిల్ మీద ఇంటింటికీ వెళ్లి డోర్ డెలివరీ చేసే బాయ్ లా కనిపిస్తున్నాడంటే ఎంత పేదరికంలో ఉన్నాడో అనిపిస్తుంది. పైగా ఆఫ్ఝఘనిస్తాన్ దేశానికి మాజీ మంత్రి అంటే నమ్మబుద్ది కాదు. కానీ కింద దిగువన ఇచ్చిన ఫోటోలో ఆయన మొహం క్లియర్ గా కనిపిస్తుంది. దేశ ఐటీ మంత్రిగా సూటుబూటులో రాచరిక బాధ్యతలు నిర్వహిస్తున్న ఫోటో పక్కనే సాధారణ పౌరుడిలా రెండు ఫోటోలు పక్కపక్కనే చూస్తే.. ఔరా ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితి ఇంత దారుణంగా మారిందా అనిపించక మానదు.

ఈ మాజీ మంత్రి మనదేశంలోలా హైస్కూలు చదువు పూర్తి చేయని వాడై ఉంటాడనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్‌ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌లో... రెండు డిగ్రీలు చేశారు. 2005 నుంచి 2016 వరకు ఆఫ్ఘనిస్తాన్‌ కమ్యూనికేషన్‌, టెక్నాలజీ మంత్రికి సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2017 వరకు లండన్‌లోని ఏరియానా టెలికాం కంపెనీ సీఈఓగా కూడా పనిచేశారు. ఈయన ప్రతిభ, సామర్థ్యాన్ని గుర్తించిన ఆఫ్ఘనిస్తాన్‌ పౌర ప్రభుత్వం 2018లో ఆ దేశ కమ్యూనికేషన్‌, టెక్నాలజీ మంత్రిగా అవకాశం కల్పించింది.  2020 వరకు మంత్రిగా పనిచేశారు. అయితే అప్పటి ఆఫ్ఘనిస్తాన్ దేశాధ్యక్షుడు ఘనితో వచ్చిన విభేదాల వల్ల మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి జర్మనీకి వెళ్లిపోయారు.

జర్మనీ నగరంలోని లీప్ జిగ్ సిటీలో సాధారణ జీవితం గడిపినా చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా అయిపోవడంతో పొట్ట కూటి కోసం ఇలా సైకిల్‌పై తిరుగుతూ డెలివరీ బాయ్‌గా మారాడు. జర్మనీకి చెందిన లివ్‌రాండో కంపెనీకి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సాదత్‌ ఫొటోలను అరబ్‌ మీడియా సంస్థ అల్‌ జజీరా ట్వీట్‌ చేసిన కాసేపటికే వైరల్ అయ్యాయి. తన పరిస్థితి వాస్తవమేనని, అల్ జజీరా ట్వీట్ చేసిన ఆ ఫోటోలు తనవేనని సాదత్‌ ధృవీకరించారు. విలాస వంతమైన జీవితం గడిపే పెద్దలకు తన జీవితం కనువిప్పు అవుతుందని సాదత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాతో సహా మొత్తం 13 దేశాల్లో 23 కంపెనీల్లో 23 ఏళ్ల పాటు కమ్యూనికేషన్‌ రంగంలో పనిచేసిన తాను ఆఫ్ఘనిస్తాన్ దేశంలో సెల్ ఫోన్ నెట్ వర్క్ విస్తరించేందుకు కృషి చేశానని గుర్తు చేసుకున్నారు. బతుకుదెరువు కోసం జర్మనీకి వలస వచ్చిపోయిన తాను ఇప్పుడు సైకిల్ మీద పిజ్జాలు డెలివరీ చేస్తున్నానని, తన జీవితం కొందరికైనా కనువిప్పు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.