
- పాల్గొనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజుల పాటు ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ – 2025 జరగనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ ను ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. రెండు రోజుల ఈ సదస్సులో దేశంలోని 29 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, 17 మంది డిప్యూటీ స్పీకర్లు, ఆరు రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. 1925 ఆగస్టు 24న సెంట్రల్ లెజిస్లేటీవ్ అసెంబ్లీ తొలి స్పీకర్ గా విఠల్ భాయ్ పటేల్ ఎన్నికయ్యారు.
ఆయన శతజయంతి సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా తెలిపారు. ఇందులో భాగంగా విఠల్ భాయ్ స్మారక స్టాంపును అమిత్షా రిలీజ్ చేయనున్నారు. సోమవారం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ముగింపు ప్రసంగంతో కాన్ఫరెన్స్ ముగుస్తుందని విజేందర్ గుప్తా తెలిపారు. కాగా, ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఢిల్లీ చేరుకుంది. ఈ బృందంలో స్పీకర్ తో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, లేజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు, పలువురు అధికారులు ఉన్నారు. మొత్తం నాలుగు సెషన్లలో సదస్సు..
నాలుగు సెషన్లలో ఈ సదస్సు జరగనుంది.
విఠల్ భాయ్ పటేల్: భారత దేశ రాజ్యాంగం, శాసనసభ సంస్థలను రూపొందించడంలో పాత్ర’అనే అంశంపై మాజీ స్పీకర్ మీరా కుమార్ ప్రసంగించనున్నారు. ‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి’అనే థీమ్పై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ మాట్లాడననున్నారు. ‘స్వాతంత్ర్య ఉద్యమ, సామాజిక సంస్కరణలలో స్వాతంత్ర్యానికి ముందు శాసనసభల జాతీయవాద నాయకుల పాత్ర’అనే మూడో సెషన్ కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాతినిధ్యం వహించనున్నారు.