రెండు వేదికలు.. హుజూరాబాద్ చవితి వేడుకల్లో పాలిటిక్స్

రెండు వేదికలు.. హుజూరాబాద్ చవితి వేడుకల్లో పాలిటిక్స్

హుజూరాబాద్,​ వెలుగు: బై పోల్ ​నేపథ్యంలో కరీంనగర్​జిల్లా హుజూరాబాద్​లో అన్ని ప్రోగ్రామ్స్​ రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. చవితి వేడుకలను సైతం టీఆర్ఎస్​ లీడర్లు ప్రచారానికి అనుకూలంగా మార్చుకున్నారు. సుమారు 17 సంవత్సరాలుగా విశ్వహిందూ పరిషత్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో హుజూరాబాద్​లో గణేశ్​ నిమజ్జన వేడులకు జరుగుతున్నాయి. అయితే ఈ సంవత్సరం టీఆర్ఎస్​ లీడర్లు ఉత్సవ కమిటీ వేదిక పక్కన మరో వేదిక ఏర్పాటు చేశారు. పార్టీ వేదికలా కనిపించే విధంగా తీర్చిదిద్దారు. పార్టీ ప్రచార రథాలను వేదిక వద్ద ఉంచి ఆడి పాడారు. దీంతో అక్కడికి వచ్చిన ప్రజలు, భక్తులు సైతం ఇదేం తీరంటూ ముక్కున వేలేసుకున్నారు. వేదికపై టీఆర్ఎస్​కు చెందిన గెల్లు శ్రీనుతో సహా పార్టీ నాయకులు హంగామా చేశారు. గెల్లు యువతులతో కలసి కోలాటం ఆడారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్​ఉత్సవ కమిటీ వేదిక వద్దకు చేరుకోవడంతో పోటాపోటీగా నినాదాలు చేశారు. అదే వేదిక మీద ఉన్న మున్సిపల్ ​చైర్​పర్సన్, కౌన్సిలర్లకు ఈటల అభివాదం చేశారు. సంయమనం పాటించాలని, వేదిక రాజకీయాలకు అతీతంగా ఉండాలని సూచించారు. ఏమైనప్పటికీ సంప్రదాయాలకు విరుద్ధంగా పార్టీ తరఫున వేదిక ఏర్పాటు చేసి రాజకీయం  చేయటం సరికాదని స్థానిక భక్తులు విమర్శించారు.