అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా?.. ఈ ఫుడ్స్ ను తీసుకెళ్తే బుక్ అయినట్టే

 అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా?.. ఈ ఫుడ్స్ ను తీసుకెళ్తే బుక్ అయినట్టే

ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్నారా? తీర్థయాత్రలో మీరు శీతల పానీయాలు, కరకరలాడే స్నాక్స్, డీప్ ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ , జిలేబీ, హల్వా వంటి భారీ స్వీట్లు, పూరీలు, చోలా వంటి వాటిని తీసుకెళ్లాలని ప్లాన్ వేసుకుంటున్నారా..? అయితే ఆ ప్లాన్ ను వెంటనే విరమించుకోండని అధికారులు సూచిస్తున్నారు.

 అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు జారీ చేసిన వార్షిక యాత్రకు సంబంధించిన ఆరోగ్య సలహాల్లో భాగంగా కష్టతరమైన ట్రెక్‌లో యాత్రికుల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను అధికారులు నిషేధించాయి. యాత్రికులు, సర్వీస్ ప్రొవైడర్లకు ఆహారాన్ని అందించడానికి, విక్రయించడానికి యాత్రా ప్రాంతంలోని లంగర్ సంస్థలు, ఫుడ్ స్టాల్స్, దుకాణాలు, ఇతర సంస్థలకు వర్తింపజేయడానికి ఒక వివరణాత్మక ఫుడ్ మెనూను సిద్ధం చేశారు. ఎత్తైన ప్రదేశాలు, నిటారుగా ఉన్న పర్వత ప్రాంతాల గుండా ప్రయాణించే 14-కిమీల సుదీర్ఘ ట్రెక్‌లో యాత్రికులను 'అనారోగ్యకరమైన' ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

2022లో అమరనాథ్ యాత్రలో దాదాపు 42 మంది యాత్రికులు సహజ కారణాల వల్ల మరణించారు. ఈ యాత్రకు వచ్చే వారికి ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాత్రికులను సురక్షితంగా ఉంచడానికి యాత్రా మార్గంలో వివిధ ప్రదేశాలలో ఆక్సిజన్ బూత్‌ల ఏర్పాటు, ఆసుపత్రుల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టింది. గత సంవత్సరం నుంచి యాత్రికుల శ్రేయస్సును పర్యవేక్షించడానికి RFID ట్యాగ్‌లు కూడా ఉపయోగించబడుతున్నాయి. ఈ సంవత్సరం యాత్రికులు ఫిట్‌గా ఉండటానికి తీర్థయాత్ర సమయంలో 'సరైన ఆహారం తినేలా' అధికారులు చర్యలు చేపట్టారు.