ఆంధ్రా కాంట్రాక్టర్లను తరిమికొట్టాలి

ఆంధ్రా కాంట్రాక్టర్లను తరిమికొట్టాలి
  • వాళ్లకు ఇచ్చిన కాంట్రాక్టులన్నీ క్యాన్సిల్​ చేయాలి: వివేక్​ వెంకటస్వామి'
  • సీఎం అక్రమాల వల్ల రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్లకు చేరినయ్​
  • గ్రాఫ్​ పడిపోతున్నదనే దేశ రాజకీయాల్లోకి పోతా అంటున్నడని విమర్శ
  • నిజామాబాద్​, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటన , సమ్మక్క, సారలమ్మకు మొక్కులు  

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్​లో, గోదావరిఖనిలో ఏర్పాటుచేసిన  సమ్మక్క, సారలమ్మ జాతరలకు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఆయా చోట్ల నిలువెత్తు బంగారం సమర్పించి, తల్లులకు మొక్కులు సమర్పించారు. తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని తల్లులను కోరుకున్నట్లు వివేక్​ తెలిపారు.

నిజామాబాద్/పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు: తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందని, రూ. లక్ష కోట్లకు పైగా విలువైన పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టిందని బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ మెంబర్, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రా కాంట్రాక్టర్లను తెలంగాణ నుంచి తరిమికొట్టాలన్నారు. శుక్రవారం వివేక్​వెంకటస్వామి నిజామాబాద్, పెద్దపల్లి​ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రం వస్తే ఇక్కడి వాళ్లకే కాంట్రాక్టులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రజలకు మాట ఇచ్చారని, అందువల్ల ఏపీ కాంట్రాక్టర్లకు ఇచ్చిన కాంట్రాక్టులను వెంటనే క్యాన్సిల్​ చేయాలని డిమాండ్​ చేశారు. లేదంటే ఇందుకోసం బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. 
దళిత వ్యతిరేకి కేసీఆర్​
అవినీతి, అక్రమాలకు అడ్డు వస్తోందనే సీఎం కేసీఆర్​ రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారని వివేక్​ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం​ రాజ్యాంగ పరిరక్షణపై బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్​లో రౌండ్​ టేబుల్​ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు వివేక్​ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ బస్వా లక్ష్మీనర్సయ్య అధ్యక్షత వహించారు. వివేక్​ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ అవినీతి, అక్రమాల వల్ల రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లకు చేరాయని ఆరోపించారు.  కౌలు రైతులకు రైతుబంధు అమలు చేయాలని తాను చెప్పానని, కౌలు రైతుల్లో ఎక్కువ మంది దళితులు ఉండటం వల్లనే వారికి కేసీఆర్​ రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. ‘‘కేసీఆర్​కు దళితుల ఓట్లు కావాలి తప్ప వారి సంక్షేమం గురించి పట్టింపు లేదు. కేసీఆర్​ దళిత వ్యతిరేకి. అందుకే ఒక్కసారి కూడా ఆయన అంబేద్కర్​ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని , ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిండు. ఇద్దరు దళిత ఉప ముఖ్యమంత్రులను బర్తరఫ్  చేసిండు. అంబేద్కర్​దళిత బిడ్డ కావడం వల్లనే ఆయన రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్​ మార్చాలంటున్నడు. తనకు అనుకూలంగా ఉండేలా రాజ్యాంగాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నడు” అని మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ భూములన్నీ కేసీఆర్ కుటుంబంలో చేతిలో బందీ అయ్యాయని, కల్వకుంట్ల ఫ్యామిలీ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదని, కేవలం కల్వకుంట్ల తెలంగాణ మాత్రమేనన్నారు. 
కేసీఆర్​ గ్రాఫ్​ పడిపోతున్నది
అవినీతి పాలన కారణంగా ప్రజల్లో కేసీఆర్ గ్రాఫ్​ పడిపోతున్నదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్​ పార్టీకి ఓటమి తప్పదని వివేక్​ వెంకట స్వామి అన్నారు. నిజామాబాద్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘టీఆర్​ఎస్​ ఎన్ని జిమ్మిక్కులు చేసినా హుజూరాబాద్​ ఎన్నికల్లో ఓడిపోయింది. దీన్ని పక్కదారి పట్టించేందుకే కేంద్ర రాజకీయాల్లోకి పోతా.. ప్రధాని అవుతా అని కేసీఆర్​ అంటున్నడు” అని విమర్శించారు. సీఎం కేసీఆర్​ రాష్ట్రంలో ప్రజాధనం లూటీ చేసి ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలకు పాల్పడుతున్నారని, మొన్న తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్​ కు, ఇప్పుడు యూపీ ఎన్నికల్లో అఖిలేశ్​​ యాదవ్​కు ఎన్నికల​ ఫండ్​ ఇచ్చారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్​కు  ఓటమి ఖరారైనందునే ఎన్నికల కన్సల్టెంట్​ ప్రశాంత్​ కిశోర్​ను  పార్టీకి​ సలహాదారుగా పెట్టుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్​ఎస్​ను, కేసీఆర్​ను తెలంగాణ ప్రజలు తరిమి కొడతారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ స్టేట్​సెక్రటరీ పల్లె గంగారెడ్డి, ఆర్మూర్​ బీజేపీ నాయకులు వినయ్​ రెడ్డి , బాల్కొండ నాయకులు డాక్టర్​ ఏలేటి మల్లికార్జున్​ రెడ్డి , బోధన్​ నాయకులు మేడపాటి ప్రకాశ్​ రెడ్డి , నిజామాబాద్​ అర్బన్​ నాయకులు ధన్​పాల్​ సూర్యనారాయణ, న్యాలం రాజు, ​లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.