ఇంజనీరింగ్‌‌లో మరో 5 వేల సీట్లు

ఇంజనీరింగ్‌‌లో మరో 5 వేల సీట్లు
  • హైకోర్టు ఆదేశాలతో అనుమతులిచ్చిన సర్కారు
  • కొత్త కోర్సుల్లో 3,500, కోర్సుల కన్వర్షన్‌‌తో మరో 1,500 సీట్లు
  • ఉత్తర్వులు రాగానే ఎంసెట్ అడ్మిషన్ల స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో మరిన్ని సీట్లు పెరగనున్నాయి. కంప్యూటర్ సైన్స్‌‌తో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సుల్లో 5 వేల వరకు సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీట్ల పెంపుపై సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలో, రేపో విడుదల కానున్నాయి. ఆ వెంటనే ఎంసెట్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల షెడ్యూల్‌‌ను రిలీజ్ చేయనున్నారు.
సుప్రీంకు వెళ్లిన జేఎన్టీయూ.. అయినా..
రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 90 వేల సీట్లున్నాయి. ఇప్పటికే ఎంసెట్ ఫస్ట్ కౌన్సెలింగ్ పూర్తి కాగా, మొత్తం 46 కోర్సుల పరిధిలో కన్వీనర్ కోటాలో 74,071 సీట్లకు గానూ 60,941 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో కంప్యూటర్ సైన్స్, ఐటీ రిలేటెడ్‌‌లో 18 కోర్సులుండగా, వీటిలో 95.56 శాతం సీట్లు నిండాయి. కంప్యూటర్ సైన్స్ సీట్ల కోసం గతంలో మేనేజ్‌‌మెంట్లు అప్లై చేసుకున్నా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కొన్ని మేనేజ్‌‌మెంట్లు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో సీట్ల పెంపునకు ఏఐసీటీఈ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సర్కారు పర్మిషన్ అవసరం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ జేఎన్టీయూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగానే హైకోర్టు తీర్పు ఆధారంగా కొత్త సీట్లకు పర్మిషన్ ఇస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 25 కాలేజీల్లో కొత్త కోర్సుల్లో 3,500 సీట్లు, సాంప్రదాయ కోర్సుల నుంచి కంప్యూటర్ సైన్స్​రిలేటెడ్ కోర్సులకు కన్వర్షన్ కోసం పెట్టుకున్న కాలేజీల్లో మరో 1,500 దాకా సీట్లు పెరగనున్నాయి.

కొత్తగా రూ.10 వేల కాషన్ డిపాజిట్
ఈ ఏడాది కొత్తగా జీరో ఫీజు స్టూడెంట్లు సీట్ల కన్ఫర్మేషన్ కోసం కాషన్ డిపాజిట్ కట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయిం చింది. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్లతోపాటు పది వేల లోపు ర్యాంకులు సాధించిన స్టూడెంట్లకే ఈ విధానం అమలు చేయనున్నారు. జీరో ఫీజు స్టూడెంట్లలో కొందరు ఐఐటీ, ఎన్ఐటీ, డిగ్రీ తదితర వేరే కోర్సుల్లో చేరినప్పుడు, అప్పటికే పొందిన ఇంజనీరింగ్ సీట్లను కేన్సిల్ చేసుకోవట్లేదు. దీంతో ఆ సీట్లన్నీ మిగిలిపోతున్నాయి. ఆయా కేటగిరీ లోని స్టూడెంట్లకు సెకండ్ ఫేజ్‌‌లో సీటు వస్తే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.5 వేలు, పది వేల లోపు ర్యాంకు ఉన్న మిగిలిన స్టూడెంట్లు10 వేలు కాషన్ డిపాజిట్ చేసి సీట్లు రిజర్వు చేసుకొని, మరో కౌన్సెలింగ్‌‌లో పాల్గొనవచ్చు. లేకుంటే కాలేజీల్లో జాయినింగ్ రిపోర్టు చేయాలి. స్టూడెంట్లు కట్టిన మొత్తాన్ని కాలేజీల్లో చేరిన తర్వాత రిటర్న్ చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు.