
- ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ చెన్నయ్య
ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేర్కొంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ సిటీలోని ఓ హోటల్లో ఎస్సీ వర్గీకరణపై పోరాట సమితి రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. దీనికి కన్వీనర్ చెన్నయ్య, కో కన్వీనర్ చెరుకు రామచందర్, బేర బాలకిషన్, సర్వయ్య, తాళ్లపల్లి రవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణతో తెలంగాణలో ఉన్న 50 లక్షల మంది మాలలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా హైదరాబాద్ సిటీలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ వల్ల మాల ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి వారిని చైతన్యపర్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వర్గీకరణపై అధ్యయనం చేయడానికి వేసిన కమిటీలో మల్లు రవి బేషరతుగా వైదొలగాలని కోరారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 50 లక్షల మంది మాలల తరఫున వాస్తవాలను తెలియజేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, మండలాల సదస్సులు నిర్వహించి ప్రభుత్వానికి మాలల సత్తా ఏంటో చూపిద్దామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కిషన్, కనకరాజు, మంత్రి నరసింహయ్య, వెంకటేశం, జి. శంకర్, గుడిమల్ల వినోద్ కుమార్, చేతన్, దుబ్బాక నవీన్, ఆవుల సుధీర్, శ్రీరాములు తో పాటు తదితరులు పాల్గొన్నారు.