వరంగల్‌‌ రైల్వేస్టేషన్‌‌లో లిఫ్ట్‌‌లు, ఎస్కలేటర్లు.. రూ.25.41 కోట్లతో అభివృద్ధి

వరంగల్‌‌ రైల్వేస్టేషన్‌‌లో లిఫ్ట్‌‌లు, ఎస్కలేటర్లు.. రూ.25.41 కోట్లతో అభివృద్ధి
  • మౌలిక వసతులతో పాటు కాకతీయుల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు
  • ఇయ్యాల వర్చువల్‍గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

వరంగల్‍/కరీమాబాద్‍, వెలుగు : కళ్లు చెదిరే లైటింగ్‌‌, లిఫ్ట్‌‌లు, ఎస్కలేటర్లు, ల్యాండ్‌‌ స్కేపింగ్‌‌తో వరంగల్‌‌ రైల్వే స్టేషన్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌ను తలపిస్తోంది. అమృత్‌‌ భారత్‌‌ స్కీమ్‌‌లో భాగంగా పలు రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. ఇందుకు వరంగల్‌‌, కాజీపేట, మహబూబాబాద్‌‌, జనగామ రైల్వేస్టేషన్లను ఎంపిక చేసింది. ఇందులో వరంగల్‌‌ స్టేషన్‌‌ ఆధునికీకరణ పనులు పూర్తి కావడంతో ప్రధాని మోదీ గురువారం వర్చువల్‌‌గా ప్రారంభించనున్నారు.

 వర్చువల్‌‌గా ప్రారంభం

వరంగల్‌‌ రైల్వేస్టేషన్‌‌ ఆధునికీకరణ పనులు పూర్తి కావడంతో గురువారం ఉదయం 9 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్‌‌గా స్టేషన్‌‌ను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైల్వే ఆఫీసర్లతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు బుధవారం (May 21) ఏర్పాట్లను పరిసీలించారు. స్టేషన్‌‌ ప్రారంభ కార్యక్రమం, అతిథుల స్పీచ్‍ అందరికీ కనిపించేలా స్టేషన్‌‌ ఆవరణలో భారీ ఎల్‌‌ఈడీ స్క్రీన్‌‌ ఏర్పాటు చేశారు.

మంత్రులు, ఎంపీలు హాజరవుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు స్టేషన్‌‌ ప్రారంభం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బీజేపీ నేతలు బుధవారం స్టేషన్‌‌లో పర్యటించారు. మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‍రావు, అజ్మీరా సీతారాంనాయక్‍, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, అరూరి రమేశ్‍, బీజేపీ వరంగల్‍, హనుమకొండ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్‍, కొలను సంతోష్‍రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‍రావు, రావు పద్మ, డాక్టర్‍ కాళీప్రసాద్‍, కార్పొరేటర్‍ చాడ స్వాతి శ్రీనివాస్‍రెడ్డి స్టేషన్‌‌ను సందర్శించి పనులను పరిశీలించారు. 

రూ. 25.41 కోట్లతో పనులు

వరంగల్‌‌ రైల్వేస్టేషన్‌‌ నుంచి రోజుకు సగటున 31,887 మంది రాకపోకలు సాగిస్తుండగా.. రూ. 41.09 కోట్ల వార్షిక ఆదాయం వస్తోంది. ఇక్కడి నుంచి న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్‌‌, తిరుపతి వంటి నగరాలకు సూపర్‌‌ఫాస్ట్‌‌ రైళ్లు నడుస్తుంటాయి. అమృత్‌‌ భారత్‌‌ పథకంలో భాగంగా వరంగల్‌‌ రైల్వే స్టేషన్‌‌ను ఎంపిక చేసిన కేంద్రం అభివృద్ధి పనుల కోసం రూ.25.41 కోట్లు కేటాయించింది.

ఈ నిధులతో ఫ్లాట్‌‌ఫామ్స్‌‌ను ఆధునికీకరించడంతో పాటు 12 మీటర్ల వెడల్పుతో ఫుట్‌‌ ఓవర్‌‌ బ్రిడ్జి, మూడు లిఫ్టులు, నాలుగు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. అలాగే మోడల్‌‌ టాయిలెట్లు, వెయిటింగ్‌‌ హాల్‌‌, ఫుడ్‌‌ స్టాల్స్‌‌, రెస్ట్‌‌రూమ్స్‌‌ నిర్మించడంతో పాటు దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. స్టేషన్‌‌ ఆవరణలో ల్యాండ్‌‌ స్కేప్స్‌‌, కాకతీయుల కాలం నాటి కళలు, సంస్కృతి ఉట్టిపడే చిత్రాలు ఏర్పాటు చేశారు.