Stock Market: భారత మార్కెట్లలో ట్రిగరైన కల్లోలం.. ఫ్యూచర్ రివీల్.. ఇన్వెస్టర్లకు ఇక దేవుడే దిక్కు!

Stock Market: భారత మార్కెట్లలో ట్రిగరైన కల్లోలం.. ఫ్యూచర్ రివీల్.. ఇన్వెస్టర్లకు ఇక దేవుడే దిక్కు!

భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు నిన్నటి నష్టాల నుంచి తేరుకుని భారీ లాభాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలకు కళ్లెం పడింది. నేడు కీలక బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగటానికి.. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, రియల్టీ, హెల్త్ కేర్ వంటి రంగాలు అండగా నిలిచాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ ఆసియా మార్కెట్లలో బుల్స్ జోరుతో భారతీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నేడు ముందుకు సాగుతున్నాయి. 

అయితే ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లను కొత్త భయాలు అలుముకుంటున్నాయి. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల ధోరణులతో విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను విక్రయించి ఆ డబ్బును చైనా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలనే కొత్త ధోరణి ట్రిగర్ అయ్యింది. మరోపక్క అమెరికా రేటింగ్ కూడా మూడీస్ తగ్గింపుతో బాండ్లపై రాబడి తగ్గుతుందనే ఆందోళనలు పెరిగిపోయాయి. దీంతో 'సెల్ ఇన్ ఇండియా.. బై ఇన్ చైనా' నినాదం మార్కెట్లో ఊపందుకుంది. యూఎస్ చైనా డీల్ గతవారం ప్రకటించబడటంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బును చైనాకు తరలించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ యూఎస్ డీల్ కారణంగా తిరిగి పుంజుకోవటమే దీనికి కారణంగా వారు చెబుతున్నారు. 

ఈ ధోరణి భారత మార్కెట్లకు ముప్పని జియోజిత్ ఫైనాన్షియల్‌కు చెందిన డాక్టర్ వి.కె. విజయకుమార్ అన్నారు. ఇంత భారీ స్థాయిలో విదేశీ మదుపరులు అకస్మాత్తుగా ఇండియా మార్కెట్లను వీడి వెళ్లిపోవటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న ఒక్కరోజే విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ.10వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకోవటం గమనార్హం. ఫిబ్రవరి మాసం తర్వాత ఇంత భారీ స్థాయిలో విదేశీ మదుపరులు వెనక్కి వెళ్లటం తొలిసారి. 

రానున్న ఏడాది భారత మార్కెట్లు ఎలా ఉంటాయ్..?
కొనసాగుతున్న ప్రపంచ అస్థిరతలు భారత ఈక్విటీ మార్కెట్లపై కూడా కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అందరికీ టెన్షన్ కలిగిస్తున్న అంశం ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ ఫేబర్ ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ప్రత్యేక రాబడిని ఇవ్వబోదని తేల్చి చెప్పటమే. భారీ రాబడులు ఆశించకపోవటం మంచిదని ఆయన పేర్కొన్నారు. తనకు భారతీయ ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం ఖరీదైనవిగా ఉన్నట్లు అనిపిస్తోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత్ కంటే ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో ఇండెక్స్ తక్కువ రాబడిని ఇచ్చినప్పటికీ సరైన స్టాక్స్ ఎంపిక కొంత మంచి రాబడులను అందించవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే క్రిప్టోల గురించి అడిగిన ప్రశ్నకు బడులిస్తూ తాను గోల్డ్ కలిగి ఉండటం ఉత్తమంగా పేర్కొన్నారు.

భారతీయ ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయాలు:
ఇండియన్ స్టాక్ మార్కెట్లలో ఇదే ధోరణి కొనసాగితే.. ఈక్విటీ మార్కెట్ ఒత్తిడికి లోనవుతుంది. పెరుగుతున్న యుఎస్ బాండ్ ఈల్డ్స్, పెరిగిన జపాన్ బాండ్ రాబడులు, ఇండియాలో కోవిడ్ కేసులు, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై పుకార్ల పట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.