
- సీఎస్ఐఆర్ ఐఐసీటీ రూపొందించిన ఏజీఆర్ టెక్నాలజీ ఆధారంగా గ్యాస్ ప్లాంట్
- హైదరాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్ తరహాలో ఏర్పాటు
- ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రపోజల్స్‌ను ఆహ్వానించిన బల్దియా
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో వెలువడుతున్న చెత్త నుంచి కరెంట్, బయోగ్యాస్ ఉత్పత్తికి బల్దియా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సికింద్రాబాద్ బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో సీఎస్‌ఐఆర్ ఐఐసీటీ రూపొందించిన అనొరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్(ఏజీఆర్) టెక్నాలజీతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్ తరహాలోనే కరీంనగర్‌లోనూ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ఆసక్తి కలిగిన సంస్థలు,వ్యక్తుల నుంచి ప్రపోజల్స్‌ను ఆహ్వానిస్తూ ఆఫీసర్లు నోటిఫికేషన్ ఇచ్చారు. వ్యర్థాల నుంచి ఎల్పీజీ గ్యాస్, కరెంట్ ఉత్పత్తి చేస్తే చెత్త సమస్యకు పరిష్కారం దొరకడంతోపాటు బల్దియాకు ఆదాయం సమకూరనుంది.
బోయిన్ పల్లి మార్కెట్‌లోని ప్లాంట్ తరహాలో..
సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి బీఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని కూరగాయల మార్కెట్ నుంచి వెలువడే వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించేందుకు నెలకు రూ.30 లక్షల వరకు ఖర్చయ్యేది. ఈక్రమంలోనే 2019లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సంస్థ రూపొందించిన ఏజీఆర్ టెక్నాలజీ ఆధారంగా ఈ మార్కెట్ లో ఓ ప్రైవేట్ సంస్థ 10 టన్నుల కెపాసిటీతో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మించింది.
మార్కెట్‌నుంచి వెలువడే కూరగాయలు, పండ్లు, పూలు వ్యర్థాల ద్వారా రోజుకు 500 యూనిట్ల కరెంట్, 30 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ ఉత్పత్తవుతోంది. మిగతా వ్యర్థాలతో సేంద్రీయ ఎరువులను తయారుచేసి రైతులకు అమ్ముతున్నారు. దీంతో నెల తిరిగేసరికి ఆదాయం రావడంతోపాటు డంపింగ్ యార్డుకు చెత్త తరలించేందుకయ్యే రూ.30 లక్షలు ఆదా అవుతున్నాయి. కరీంనగర్ లోనూ ఇదే టెక్నాలజీతో బయో గ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు.
సెగిగ్రేషనే పెద్ద సవాల్..
బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌లో కూరగాయల వ్యర్థాలన్నీ ఒకేచోట లభ్యం కావడంతో వ్యర్థాల సేకరణ, ప్లాంట్ నిర్వహణ ఈజీగా మారింది. కానీ కరీంనగర్ సిటీ మొత్తం నుంచి చెత్త సేకరించడం, ఆ చెత్తలో నుంచి ఆహార వ్యర్థాలు, కూరగాయల వ్యర్థాలను సెగిగ్రేట్(వేరు) చేయడం సవాల్‌గా మారనుంది. తడి, పొడి చెత్తను ప్రజలు తమ ఇళ్లలోనే వేరు చేస్తే మున్సిపల్ సిబ్బందికి పని సులువు కానుంది. అందుకే మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఇతర సిబ్బంది కరీంనగర్ సిటీలో ఇళ్లలో తడి, పొడి చెత్తతోపాటు ఇతర చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించడం ప్రారంభించారు. ఇంట్లో ఉత్పత్తయ్యే చెత్తను మూడు పద్ధతుల్లో వేరు చేయాలని సూచిస్తున్నారు. చెత్తను సెక్రిగేషన్ చేసే పద్ధతులను స్వయంగా వివరిస్తున్నారు.
సిటీలో రోజుకు 11 టన్నుల తడి చెత్త..
కరీంనగర్ సిటీలో నిత్యం 3 టన్నుల మేర కూరగాయల వ్యర్థాలు పోగవవుతుండగా.. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి 7 టన్నుల నుంచి 8 టన్నుల వరకు ఆహార వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ వ్యర్థాలతోనే బయో గ్యాస్ ప్లాంట్‌ను నిర్వహించబోతున్నారు. తొలుత 2 టన్నుల కెపాసిటీతో ప్లాంట్ ఏర్పాటు చేసి.. దాని పనితీరు, ఫలితాలను బట్టి కెపాసిటీని పెంచనున్నట్లు బల్దియా ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ స్వామి వెల్లడించారు. కూరగాయలు, ఫుడ్ వ్యర్థాలను సేకరించేందుకు.. సిటీలోని సుమారు 300 అపార్ట్‌మెంట్లలో చెత్త వేరుచేయడంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.