భూ సర్వేతో వివాదాలకు పరిష్కారం : కలెక్టర్ ​ముజమ్మిల్ ​ఖాన్​

భూ సర్వేతో వివాదాలకు పరిష్కారం : కలెక్టర్ ​ముజమ్మిల్ ​ఖాన్​

ఎర్రుపాలెం, వెలుగు : భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ​ఖాన్​ అన్నారు. ఎర్రుపాలెం మండలంలోని పైలెట్​ ప్రాజెక్టుగా ఎంపికైన ములుగుమాడు భూ సర్వే ప్రక్రియను ప్రారంభించగా బుధవారం ఆయన పరిశీలించి ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. లైసెన్స్ కలిగిన సర్వేయర్లను ఏర్పాటు చేసి భూ సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. జిల్లాలో సుమారు 90వేల వరకు సాదా బైనామాలో ఉన్నాయని, ధరణిలో వీటి పరిష్కారానికి ఆస్కారం లేదని, నేడు భూ భారతి చట్టంలో ఒక మార్గం దొరికిందని తెలిపారు. భూ హక్కుల యాజమానుల ఆర్డర్లను తహసీల్దార్ 30 రోజుల్లోగా విచారణ చేసి జారీ చేయాలని, లేకపోతే  ఆటోమేటిక్ గా దరఖాస్తు ప్రకారం ఆర్డర్ పాస్ అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, ఎర్రుపాలెం మండల తహసీల్దార్ ఉషా శారద, అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం నగరాన్ని శుభ్రంగా ఉంచాలి

ఖమ్మం కార్పొరేషన్ :  ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు.  కార్పొరేటర్ రఫిదా బేగం ముస్తఫా, అధికారులతో కలిసి 57వ డివిజన్ లోని రమణగుట్ట, వికలాంగుల కాలనీ, జగ్జీవన్ రాం కాలనీలోని పలు ప్రాంతంలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఓపెన్ ల్యాండ్ లో చెత్త పేరుకొని పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వికలాంగుల కాలనీలో శిథిలావస్ధలో ఉన్న పాఠశాలను తొలగించి కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు.