
జీవవైవిధ్యం అనగా భూమిపైగల వివిధ రకాల జీవజాతులు. జీవవైవిధ్యం భవిష్యత్ తరాలకు అపారమైన విలువ కలిగిన ఆస్తి. అయితే, మానవ కార్యకలాపాల ద్వారా జాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి జీవవైవిధ్యం నశించిపోతోంది. జీవవైవిధ్యం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, జీవ వైవిధ్యంపై ప్రజలలో అవగాహనను పెంచటానికి ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మే22 న ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని’ జరుపుకోవాలని నిర్ణయించింది. 2025 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఇతివృత్తం 'ప్రకృతితో సామరస్యం, స్థిరమైన అభివృద్ధి'.
భారతీయ సంస్కృతిలో జీవవైవిధ్యాన్ని పూజించటం, దైవస్వరూపంగా భావించటం గొప్పవిషయం. అందులో భాగంగానే చెట్లు, ఆవు, కోతి, పాము మొదలుగువాటిని పూజించటం జరుగుతోంది. జీవవైవిధ్యంలోని జీవజాతులు వివిధ రకాల సేవలను, ప్రయోజనాలను మానవ జాతికి, పర్యావరణానికి అందిస్తాయి. ఉదాహరణకు మానవులు, ఇతర జీవజాతుల జీవనక్రియలలో భూమిపై విడుదల అయ్యే వ్యర్ధ పదార్థాలను భూమిలోని సూక్ష్మజీవులు కృశింపచేసి భూమిని సారవంతం చేయుటలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ పర్యావరణ సేవలను కేవలం సూక్ష్మజీవులు మాత్రమే నిర్వహించగలవు.
జామకాయ, ఆపిల్, ఉసిరి, కూరగాయలు వంటివి ఆహారంగా పనికి వస్తాయి. అదేవిధంగా వేపచెట్టు, తులసి చెట్టు మొదలగువాటిని ఔషధాలుగా వినియోగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 80 శాతం మంది ప్రజలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదాయ మొక్కల ఆధారిత మందులపై ఆధారపడతారు. టేకుచెట్టు, షీషామ్ (ఇండియన్ రోజ్‌వుడ్), వెదురు వంటివి ఫర్నిచర్ తయారీకి ఉపయోగపడతాయి.
జీవ వైవిధ్యంలోని వివిధ జీవజాతులు ఒక నిర్దిష్టమైన పనికి లేదా పర్యావరణ సేవలకు ఉపయోగపడతాయి. అదేవిధంగా కొన్ని నిర్దిష్టమైన జంతువులు మాత్రమే మానవులు ఆహారంగా తినటానికి అనువైనవి. ఉదాహరణకు కోడిమాంసం, గొర్రె, పొట్టేలు మాంసం, జలచరాలు అయిన చేపలు మొదలగునవి తినటానికి అనువైనవి. ఇవి ఆరోగ్యానికి మంచిది. మానవ ఆహారం 80 శాతానికి పైగా మొక్కల ద్వారా అందుతోంది.
పాల ఉత్పత్తులతో ఆరోగ్యం
ఆవు పాల ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఆయుర్వేద వైద్య విధానంలో ఆవు పాల ఉత్పత్తులకు విశిష్ట స్థానం కలదు. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఆవుపాలు ఎంతో మేలుచేస్తాయి. ఆవు నెయ్యి మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచటమే కాక A,D, E, K వంటి ముఖ్యమైన విటమిన్లను కలిగి ఉంటుంది. ఆవు పాల ఉత్పత్తుల ను హిందూమత పూజా కార్యక్రమాలలో, శుభ కార్యక్రమాలలో విరివిగా వాడతారు. భారతీయ సంస్కృతిలో ఆవు ఒక భాగం. సైంటిఫిక్ పరంగా(శాస్త్రీయంగా) చూసినా ఆవు జీవవైవిధ్యంలో అత్యంత ప్రయోజనకరమైన జంతువు. ఏమి తినాలో ఎంచుకునే హక్కు (ఆహార స్వేచ్ఛ) పేరిట, జీవవైవిధ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆవును మాంసం (బీఫ్) తినుట కోసం చంపివేయటం ఖండించదగినది.
ఆవు మాంసం ఒక 'రెడ్ మీట్'. ఇది ఒక కాన్సర్ కారకం. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్)ను కలగజేస్తుంది. అదే విధంగా జీవ వైవిధ్యంలో భాగం అయిన పాలు ఇచ్చే సాధు జంతువులు అయిన గేదె, ఆవులు సంఖ్య తగ్గిపోవటం వలన డిమాండ్కు తగినవిధంగా పాల ఉత్పత్తి ఉండటం లేదు. దీంతో కల్తీ చేసిన పాకెట్ పాలు, పెరుగు, నెయ్యి, పాల ఉత్పత్తులను మార్కెట్లలో విరివిగా అమ్ముతున్నారు. వీటిని ప్రజలు విరివిగా వాడి రోగాలకు గురి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో తేనీరు(టీ) వినియోగం ఎక్కువ. హోటల్స్ లలో టీ తయారీకి కల్తీ చేసిన పాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
జీవవైవిధ్యం నశిస్తే మానవ జాతికి ప్రమాదం
జీవవైవిధ్యం నశిస్తే మానవ జాతి కూడా నశిస్తుంది. వెలకట్టలేని పర్యావరణ సేవలు, ఆరోగ్య ప్రయోజనాలు, గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్న పశువులను మాంసంగా వినియోగించరాదు. మాంసాహారం తప్పు కాదు. కానీ సమాజానికి అత్యంత అవసరమైన జంతువులను తినడం సరైనది కాదు. ప్రభుత్వాలు గోమాంసం విక్రయాన్ని నిషేధించాలి. ఎందుకంటే జీవవైవిధ్యం ఉన్నది ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చటానికి తప్ప ప్రజలను అనారోగ్యం పాల్జేయటానికి కాదు. ప్రజలు జీవవైవిధ్యానికి ఏది ముఖ్యమో, ఆహారానికి ఏది అవసరమో శాస్త్రీయంగా ఆలోచించి 'ఏమి తినాలో ఎంచుకునే హక్కును (ఆహార స్వేచ్ఛ)' సద్వినియోగం చేసుకుంటే, జీవవైవిధ్యం మనుగడ సాగించగలదు. తద్వారా మానవాళి భూమిపై ఆనందంగా జీవనం కొనసాగించగలదు. జీవవైవిధ్య నష్టం నావెల్ కరోనా వైరస్, సార్స్, ఎబోలా వ్యాధి వంటి జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోంది. జీవవైవిధ్యం కోల్పోవడం వలన మానవులు ఆరోగ్యంతో సహా అన్నింటినీ కోల్పోతారు. కాబట్టి, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి.
జీవవైవిధ్యంలో ఆవు విశిష్ట పాత్ర
ఆవు ద్వారా అనేక పర్యావరణ సేవలు, ఆరోగ్య ప్రయోజనాలు పొందటమేకాక గ్రామీణ ప్రజల ఆర్థికవృద్ధికి కూడా ఆవు ఎంతో తోడ్పడుతోంది. ఆవు పేడను ముఖ్యంగా పొడి రూపంలో చల్లితే ఖర్జూర పంట దిగుబడిని గణనీయంగా పెంచుతుందని పరిశోధనల ద్వారా తెలియవచ్చింది. అందుకనే గల్ఫ్ దేశాలు.. సౌదీ అరేబియాతోపాటు, కువైట్, యూఏఈ మొదలైన దేశాలు భారతీయ ఆవు పేడను ప్రధానంగా దిగుమతి చేసుకుంటున్నాయి. ఉదాహరణకు 2023–-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం దాదాపు రూ. 400 కోట్ల విలువైన ఆవు పేడ, సంబంధిత ఉత్పత్తులను ఎగుమతి చేసింది. రూ.125 కోట్ల విలువైన ఆవుపేడ, రూ.173.57 కోట్ల విలువైన ఎరువులను, రూ.88.02 కోట్ల విలువైన కంపోస్ట్ ఎరువులను భారత్ ఎగుమతి చేసింది.
ఈ ఎగుమతుల పెరుగుదల భారతదేశ వ్యవసాయ ఎగుమతులను బలోపేతం చేయడమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయి.
డా. శ్రీదరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్