
నల్గొండ అర్బన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం కనగల్ మండలం తేలకంటి గూడెంలో ఇండ్ల పురోగతిని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా గత జనవరి 26న తేలకంటి గూడెంలో ఇండ్లు లేని 107 మంది నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో 71 ఇండ్లు గ్రౌండింగ్కాగా ప్రస్తుతం 48 ఇండ్లు బేస్మెంట్ స్థాయిలో, రెండు రూఫ్ స్థాయిలో ఉన్నాయన్నారు.
అనంతరం పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. ఏళ్లుగా గుడిసెల్లో జీవిస్తున్న తమకు ఇండ్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఇన్చార్జి అడిషనల్కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్ తదితరులున్నారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు స్థల పరిశీలన
హాలియా, వెలుగు: యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి నాగార్జునసాగర్ వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం స్థల పరిశీలన చేశారు. అనంతరం పెద్దవూర మండలం చలకుర్తిలోని ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనాన్ని నిర్వహిస్తుండగా ఇక్కడ పాఠశాల నిర్మాణానికి గల అవకాశాలపై ఆరా తీశారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రభుత్వ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి, స్కూల్ఎదుట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు.
ఈ పాఠశాలకు డిగ్రీ కళాశాల మంజూరైనందున పాత బీఈడీ కళాశాల భవనాన్ని తమకు కేటాయించాలని స్కూల్‌యాజమాన్యం కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆమె కలెక్టర్ పాత కళాశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం పక్కనే ఉన్న భవిత కేంద్రాన్ని తనిఖీ చేశారు. మరమ్మతులు చేపట్టాలని, మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. పీహెచ్సీలో వైద్య సేవలను పరిశీలించారు.