
- ప్రైవేట్ కాలేజీల తరహాలో ప్రచారం
- 2 వేల అడ్మిషన్ల టార్గెట్
యాదాద్రి, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు లెక్చరర్లు నడుం బిగించారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లు అడ్మిషన్ల వేటలో పడ్డారు. 'రండి.. ప్రభుత్వ కాలేజీల్లోనే చేరండి..' అంటూ క్యాంపెయిన్ ప్రారంభించారు. గతంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఏజెంట్లను నియమించుకొని ఇలా ప్రచారం చేసేవి. పేరెంట్స్కు ఫోన్లు చేసి.. ఇండ్లకు వెళ్లి అడ్మిషన్లు కోరేవారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్మార్కులే కీలకం కావడంతో పేరెంట్స్ ఎక్కువగా కార్పొరేట్ కాలేజీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు బాగా తగ్గిపోయాయి. దీంతో లెక్చరర్లు విద్యార్థుల ఇంటిబాట పట్టి .. తమ కాలేజీలో చేరాలని కోరుతున్నారు.
యాదాద్రి జిల్లాలో 11 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఫస్టియర్ , సెకండియర్ కలిపి దాదాపు 3వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీల్లో చదువుతుండగా.. రెగ్యులర్, కాంట్రాక్ట్లెక్చరర్లు కలిపి 132 మంది పని చేస్తున్నారు. గతంలో లెక్చరర్ల కొరత ఉండడం వల్ల ప్రభుత్వ కాలేజీల్లో పాస్పర్సంటేజీ తక్కువగా ఉండేది. ఈసారి ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు 60 శాతానికి మించి పాసయ్యారు. సంస్థాన్ నారాయణపురంలోని సర్వేల్ గురుకులంలో 148 మంది సెకండియర్ స్టూడెంట్స్ఎగ్జామ్ రాస్తే అందరూ పాస్ అయ్యారు. ఫస్టియర్లో 162 మందికి గాను 150 మంది పాస్ అయ్యారు. మిగతా కాలేజీల్లోనూ ఉత్తీర్ణత గతంలో కన్నా మెరుగయ్యింది. గతంలోకన్నా ఉత్తీర్ణత పెరిగిందని, తమ కాలేజీల్లోనూ మంచి మార్కులు సాధిస్తున్నారని లెక్చరర్లు తల్లిదండ్రులకు నచ్చచెప్తున్నారు.
జిల్లాలోని 11 గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో 1600 మంది సెకండియర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్టియర్ లో అడ్మిషన్లు పెంచేందుకు లెక్చరర్లు పూనుకున్నారు. ఫస్టియర్లో కనీసం రెండు వేల మందిని చేర్చుకోవాలని టార్గట్గా పెట్టుకున్నారు. టెన్త్ పాస్ అయిన స్టూడెంట్ల తల్లిదండ్రుల ఫోన్నెంబర్లు తీసుకొని మాట్లాడుతున్నారు. అడ్రసులు తీసుకుని నేరుగా స్టూడెంట్ల ఇంటికి వెళ్లి తమ కాలేజీలో చేరాలని కోరుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఉన్న వసతులు, ఇక్కడ చదవడంవల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రింట్ చేయించిన కరపత్రాలను పంచుతున్నారు.
రిజల్ట్ మంచిగా వచ్చింది
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని అర్హతలు ఉన్న లెక్చరర్లు ఉన్నారు. ప్రైవేట్ కాలేజీల కంటే మంచి బోధన జరుగుతోంది. అందుకే ఈసారి గతంలో కన్నా మంచి రిజల్ట్ వచ్చింది. స్టూడెంట్స్ ప్రభుత్వ కాలేజీల్లో చేరాలని కోరుతూ వారి ఇండ్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నం.
రమణి, ఇంటర్ నోడల్ ఆఫీసర్, యాదాద్రి