నేడు మాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి.. దళిత ఉద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ

నేడు మాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి.. దళిత ఉద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ

పంచములం కాదు ఈ దేశ మూలవాసులం, పాలకులం, ఆది హిందువులం అంటూ గర్జించిన నాయకుడు.. నిజాం స్టేట్ దక్కన్ పీఠభూమితో పాటు దక్షిణ భారతదేశంలో ఆది హిందూ ఉద్యమాన్ని నిర్మించిన ఉద్యమ శిఖరం మాదరి భాగ్యరెడ్డి వర్మ. సమ సమాజంలో అణగారిన వర్గాల చైతన్యం కోసం కృషి చేసిన నాయకుడు. హైదరాబాద్​ నడిబొడ్డులో బస్తీలవారీగా పంచ కమిటీలు ఏర్పాటుచేసి ప్రజలను చైతన్యం చేసిన నాయకుడు. నిజాం స్టేట్​లో ఉర్దూ మీడియం చదువులు కొనసాగుతున్న సమయంలో ఇస్సామీయా బజార్ కోఠిలో బాలికల కోసమే తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటుచేసిన మహిళల పక్షపాతి భాగ్యరెడ్డి వర్మ. డాక్టర్ బీఆర్ అంబేద్కర్​తో పాటు మహాత్మా గాంధీతో మంచి సంబంధాలు కొనసాగించిన నాయకుడు . నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూనే ఆదిశంకరాచార్యులతో మంచి సంబంధాలు కొనసాగించిన అందరివాడు భాగ్యరెడ్డి వర్మ. ఆత్మగౌరవం కోసం నిరంతరం తపించిన మానవతావాది భాగ్యరెడ్డి వర్మ.

దక్కన్ పీఠభూమి హైదరాబాద్​లో ఇస్సామియా బజార్ బస్తీలో మాదరి వెంకయ్య, రంగమ్మలకు ఐదుగురు సంతానంలో రెండో సంతానంగా 22 మే 1888న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు బాగయ్యగా పేరు పెట్టారు.  కొన్నాళ్ల తర్వాత వాళ్లకు ఇంటి గురువు బాగయ్యలోని చురుకుదనం చూసి భాగ్యరెడ్డిగా పేరు మార్చారు.  చిన్నతనంలోనే కుటుంబ భారం పైన పడటంతో ఆయన స్థానికంగా నారాయణగూడ  వైఎంసీఏలో పనిచేసేవారు. అక్కడే ఒక ఫ్రెంచ్ అధికారితో పరిచయం ఏర్పడింది. భాగ్యరెడ్డివర్మ చేస్తున్న ప్రతి పనిని అతడు ప్రోత్సహించేవాడు.

సుల్తాన్ బజార్ లోని ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనేవారు. బస్తీలవారీగా సమస్యలు పరిష్కరించడం కోసం అంటరానితనం నిర్మూలించడం కోసం నిరక్షరాస్యులకు రాత్రిపూట చదువు నేర్పించడం కోసం సుమారు 100 బస్తీల్లోపంచ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో పంచ కమిటీలకు అనుబంధంగా జగన్ మిత్రమండలిని ఏర్పాటు చేశారు.1910లో తొలిసారిగా సుల్తాన్ బజారులో బాలికల కోసం తెలుగు మీడియం పాఠశాలను ఆది హిందూ సోషల్ లీగ్, జగన్ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రారంభించారు. బ్రహ్మ సమాజంలో ఉత్తమమైన సేవలు అందించినందుకుగాను గౌరవంగా వర్మ అనే బిరుదును సంఘసంస్కర్త బాజీ కిషన్ రావు ఆధ్వర్యంలో అందజేశారు.

గాంధీ, అంబేద్కర్​తో పరిచయం
భాగ్యరెడ్డి వర్మ 1917లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొని దళితుల ఆత్మగౌరవం కోసం చేపట్టవలసిన పనులను గురించి మహాత్మా గాంధీకి వివరించారు. వీరితోపాటు మద్రాస్​లో పెరియార్,  కేరళలో నారాయణ గురులతో అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. 1929లో లక్నోలో అంబేద్కర్ ఆధ్వర్యంలో జరిగిన డిప్రెషన్ క్లాసెస్ సమావేశానికి అధ్యక్షత వహించి దేశంలోనే అణగారిన ప్రజల హక్కుల కోసం రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లాలని ప్రతిపాదించారు.

భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలోని ఆది హిందూ సోషల్ లీగ్​లో పనిచేస్తున్న పులి జగన్ సారథ్యంలో ది పంచమాస్ అనే ఆంగ్ల పత్రికను ముందుగా ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ పత్రికను ప్రారంభించారు . ఇందులో వ్యాసాలు రాస్తూనే, గోలకొండ పత్రిక, ది హిందూ, సియాసత్ ఉర్దూ ఇలాంటి పత్రికలకు కూడా వ్యాసాలు రాశారు. దేశంలో మొట్టమొదటిసారిగా అణగారిన వర్గాలు, దళితుల జీవిత చరిత్రను ప్రతిబింబించేలా వెట్టి మాదిగ నవలను రాశారు. 

నేటి తరానికి మార్గదర్శి 
భాగ్యరెడ్డి వర్మ నిర్వహించిన ప్రతి పని నేటి తరానికి మార్గదర్శకంగా నిలిచింది.  నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ నుంచి.. దళిత చైతన్యం, మహిళా చైతన్యం, జోగిని, బాల్యవివాహాలపై తిరుగుబాటు, అడుగడుగునా ఆత్మగౌరవం కోసం కృషి చేసిన దళిత ఉద్యమ వేగుచుక్క  భాగ్యరెడ్డి వర్మ.  భారతదేశవ్యాప్తంగా తొలితరం ఉద్యమ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ 1930 నుండి అనారోగ్యానికి గురయ్యాడు.  వైద్యం కోసం ఆయన మైసూర్ వెళ్లారు.

కడుపులో పెరిగిన క్యాన్సర్ గడ్డను తొలగించారు. హైదరాబాద్​లో తన ఇంటికి వచ్చిన తర్వాత కూడా అనారోగ్యానికి గురి కావడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. చివరిదశలో చాలా సంవత్సరాల పాటు సభలు, సమావేశాలకు దూరంగా ఉన్నారు. 18 ఫిబ్రవరి 1939లో 51 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో మృతిచెందారు. భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి.

ఆది హిందూ భవన్ నిర్మాణం  
నిజాం స్టేట్ హైదరాబాద్​లో అప్పుడప్పుడే కుల సంఘాల ఆధ్వర్యంలో వారి వారి విద్యార్థి, విద్యార్థినులకు చదువులు చెప్పించడం కోసం పాఠశాలలో హాస్టళ్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రెడ్డి హాస్టల్, వైశ్య భవన్ , పద్మశాలి భవన్. మున్నూరు కాపు సంఘ భవనాలు ఏర్పాటయ్యాయి. వాటిలో భాగంగా అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఆది హిందూ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని నిజాం ప్రభుత్వాన్ని కోరారు. దానితో ప్రభుత్వం స్థలం కేటాయించగా అందులో 4 ఏప్రిల్ 1925న భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమానికి ఆదిశంకరాచార్యులు రావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల రాలేకపోయారు. 1931లో భారతదేశంలో జరిగిన కుల జనగణన ద్వారా మన నిజాం స్టేట్​లో ఉన్న దళిత, అణగారిన వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయాలని నిజాం ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు నిజాం ప్రభుత్వం దళితులను ఆది హిందువులగా గుర్తించి ప్రభుత్వ ఫర్మానా జారీ చేసింది. కానీ, నేటి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో తరతరాలు మారినా కులాల మతాల వ్యత్యాసాల మధ్యన ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. 

అస శ్రీరాములు, సీనియర్ జర్నలిస్ట్