రైతుల సంక్షేమం కోసం పని చేయండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతుల సంక్షేమం కోసం పని చేయండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •   హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గానికి సూచనలు

హుజూర్ నగర్, వెలుగు: రైతుల సంక్షేమం కోసం పని చేయాలని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. బుధవారం హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్​కు వచ్చిన ఆయన నూతన పాలకవర్గంతో మార్కెట్ అభివృద్ధిపై చర్చించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ అభివృద్ధి కావాలంటే పాలకవర్గ సభ్యులకు అవగాహన ఉండాలని, ఇందుకోసం వారికి స్టడీ టూర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

కొత్త గోదాంల నిర్మాణానికి, పాత గోదాంల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మేళ్లచెరువు, చింతలపాలెంలో సబ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏడీఏ కార్యాలయానికి భవనం లేదని వ్యవసాయ అధికారులు తెలుపగా భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొస్తానని చెప్పారు. అనంతరం చైర్ పర్సన్, డైరెక్టర్లు మంత్రిని సత్కరించారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, మార్కెట్​కార్యదర్శులు శ్రీధర్, ఎంఏ.ఘని పాల్గొన్నారు.  

మఠంపల్లి మండలాన్ని అభివృద్ధి చేశా 

మఠంపల్లి, వెలుగు: మఠంపల్లి మండలాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేశానని మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి అన్నారు. బుధవారం బక్కమంతులగూడెంలో నిర్మించిన సబ్ స్టేషన్ ను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తో కలిసి ప్రారంభించారు. మట్టపల్లి సబ్ స్టేషన్ ను మార్చేందుకు నిధులు మంజూరు చేస్తానని, లిఫ్ట్ లను జాగ్రత్త గా చూసుకోవాల్సిన బాధ్యత రైతులదేనని పేర్కొన్నారు.