IT News: టెక్కీలకు శుభవార్త.. యాక్సెంచర్ భారీ వేతన పెంపు ప్రకటన.. 2.5 ఏళ్ల తర్వాత ప్రమోషన్స్..

IT News: టెక్కీలకు శుభవార్త.. యాక్సెంచర్ భారీ వేతన పెంపు ప్రకటన.. 2.5 ఏళ్ల తర్వాత ప్రమోషన్స్..

Accenture Hikes: ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులతో ఐటీ పరిశ్రమ ప్రతికూలతలను చూస్తున్నప్పటికీ కొన్ని టెక్ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు శుభవార్తలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్న యాక్సెంచర్ టెక్నాలజీస్ రెండున్నర ఏళ్ల తర్వాత తన ఉద్యోగులకు శాలరీ హైక్స్ గురించి ఒక శుభవార్త చెప్పటం ప్రస్తుతం అందరినీ సంతోషానికి గురిచేస్తోంది. 

తాజాగా యాక్సెంచర్ కంపెనీ లెవెల్-8 అంటే అసోసియేట్ మేనేజర్ ఆపై స్థాయిల ఉద్యోగులకు వేతన పెంపులను 2.5 ఏళ్ల తర్వాత ప్రకటించింది.  ఈ క్రమంలో ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా 3 నుంచి 13 శాతం వరకు పెంపును అందిస్తోంది. అయితే కంపెనీ ప్రస్తుత చర్యలు జాగ్రత్తగా ముందుకు సాగటాన్ని సూచిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. చాలా కాలం తర్వాత హైక్స్ రావటంతో ఉద్యోగులు సైతం పెద్దగా దీనిపై ఆసక్తి కనబరచటం లేదని వెల్లడైంది. అయితే ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వ్యాపార అస్థిరతల సమయంలో ఇది ఒక శుభవార్తగానే పరిగణించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

జూన్ సైకిల్ లో ప్రస్తుత వేతన పెంపులు ఉద్యోగులకు అందనున్నాయి. ఇదే క్రమంలో కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 50వేల మందికి ప్రమోషన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సీనియర్ కంట్రీ మేనేజర్ అజయ్ విజ్ వెల్లడించారు. వీరిలో 15వేల మంది భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. అలాగే 2025 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 43వేల మంది కంటే ఎక్కువ భారతీయ ఉద్యోగులు ప్రమోషన్స్ అందుకోనున్నారని కంపెనీ వెల్లడించింది. అలాగే ఈసారి ఉద్యోగులకు బేసిక్ వేతనాన్ని కంపెనీ పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. 

దీనికి ముందు గతనెలలో దేశీయ ఐటీ కంపెనీలైన టీసీఎస్, విప్రోలు తమ ఉద్యోగులకు వేతన పెంపులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. వ్యాపారంలో కొనసాగుతున్న అస్థిరత కారణంగా సమయానుగుణంగా వేతన పెంపులను ప్రకటించనున్నట్లు వెల్లడించాయి. పైగా ఐటీ పరిశ్రమలో ఏఐ ఆధారిత టూల్స్ కి డిమాండ్ పెరుగుతున్న వేళ కంపెనీలు అదనపు పెట్టుబడులతో టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇది వ్యాపారంలో తగ్గిన మార్జిన్లకు కూడా కారణంగా ఉందని తెలుస్తోంది. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలను తమ ఉద్యోగులకు మే 26 నుంచి 29లోపు సమాచారం అందించనున్నట్లు యాక్సెంచర్ ప్రకటించింది. ఇక పోతే బోనస్, వేరియబుల్ పే డిసెంబరులో ఉంటాయని వెల్లడించారు విజ్.