బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో తెలంగాణకు అన్యాయం :మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి

బీఆర్‌‌ఎస్‌‌ పాలనలో తెలంగాణకు అన్యాయం :మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి
  • ఏపీతో ఒప్పందం చేసుకొని తెలంగాణను ఎండపెట్టిన్రు
  • కృష్ణా నీటి వాటా సాధించేందుకు కాంగ్రెస్‌‌ కృషి
  • మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి

సూర్యాపేట/మేళ్లచెరువు (చింతలపాలెం)/మఠంపల్లి, వెలుగు : కృష్ణా నీటిని తెలంగాణకు మళ్లించడంలో బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం విఫలమైందని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి విమర్శించారు. మొత్తం 811 టీఎంసీల్లో కేవలం 299 టీఎంసీల నీటినే తెలంగాణకు పరిమితం చేసి అన్యాయం చేశారని మండిపడ్డారు. ముక్త్యాల బ్రాంచ్‌‌ కెనాల్‌‌ పరిధిలోని రాజీవ్‌‌గాంధీ ఎత్తిపోతల పథకం, ముక్త్యాల బ్రాంచ్‌‌, నక్కగూడెం ఎత్తిపోతల పథకాలపై బుధవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని అంజనీ సిమెంట్‌‌ పరిశ్రమలో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌‌ మాట్లాడుతూ గత పాలకులు ప్రతి సంవత్సరం ఏపీతో ఒప్పందం చేసుకొని కృష్ణా నీటిని అక్రమంగా తరలించి తెలంగాణను ఎండపెట్టారని విమర్శించారు. పదేండ్ల పాలనలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌కు నీటి కేటాయింపులు సాధించలేకపోయారన్నారు. రాష్ట్ర విభజన టైంలో ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం చొప్పున కృష్ణా నీటిని విభజించారని, ఇందుకు కేసీఆర్‌‌ ప్రభుత్వం ఒప్పుకోవడంతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు.

తెలంగాణ 70 శాతం నీటి కేటాయింపులు జరిగేలా తమ ప్రభుత్వం బ్రిజేష్‌‌ ట్రిబ్యునల్‌‌ ఎదుట వాదనలు వినిపించిందని చెప్పారు. లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీమ్‌‌లన్నింటినీ ఏడాదిలోగా పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని ఆదేశించారు. ముక్త్యాల బ్రాంచ్‌‌కెనాల్‌‌ లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీమ్‌‌కు ఇందిరాగాంధీ లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌గా నామకారణం చేస్తున్నట్లు ప్రకటించారు. 2026 ఆగస్టు నాటికి ఈ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్‌‌ పూర్తయితే నాగార్జునసాగర్‌‌లో నీరు లేకపోయినా కృష్ణా నది నుంచి ముక్త్యాల కాల్వలోకి నీరు ఎత్తిపోసి సాగుకు అందించొచ్చని చెప్పారు.

రూ.33 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ను రూ. లక్ష కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ అవినీతి సొమ్మును ప్రాజెక్ట్‌‌లకు ఖర్చు చేస్తే ఎస్‌‌ఎల్‌‌బీసీ, నెట్టెంపాడు, దేవాదుల, కోయిల్‌‌సాగర్‌‌, డిండి వంటివి పూర్తయ్యేవన్నారు. కాళేశ్వరంతో ప్రజాధనం వృథా అయిందని, అందుకే ఎంక్వైరీ స్టార్ట్‌‌ చేశామని, అవినీతిపరులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం చేపట్టే సాగునీటి ప్రాజెక్టులకు రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఖరీఫ్, రబీ సీజన్‌‌లో దేశ చరిత్రలోనే రికార్ట్‌‌ స్థాయిలో రూ. 281 కోట్ల విలువైన వడ్లు కొన్నామని చెప్పారు. రివ్యూలో కలెక్టర్‌‌ తేజస్‌‌ నందలాల్‌‌ పవార్‌‌, ఇరిగేషన్‌‌ సీఈ రమేశ్‌‌బాబు పాల్గొన్నారు.