కాల్వల రిపేర్లకు మోక్షం .. రూ.14 కోట్లతో వరదల్లో దెబ్బతిన్న సాగర్ కాల్వల పునర్నిర్మాణ పనులు

కాల్వల రిపేర్లకు మోక్షం .. రూ.14 కోట్లతో వరదల్లో దెబ్బతిన్న సాగర్ కాల్వల పునర్నిర్మాణ పనులు
  • అప్పట్లో తాత్కాలిక మరమ్మతులకే పరిమితం 
  • రూ.45 లక్షలతో త్వరలోనే జంగిల్ క్లియరెన్స్ పనులు 
  • మళ్లీ వర్షాలు వచ్చేలోపు పూర్తి చేసేలా ప్లాన్  

ఖమ్మం, వెలుగు : గతేడాది భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల రిపేర్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. అప్పటికే సాగులో ఉన్న పంటలను దృష్టిలో  పెట్టుకొని అప్పట్లో ప్రధాన కాల్వలకు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చారు. ఇందులో ప్రధానమైనది పాలేరు దగ్గర అండర్ టన్నెల్ (యూటీ) సమీపంలో పడిన భారీ గండి. దీనివల్ల ప్రధాన కాల్వ కట్టలతో పాటు యూటీ కూడా డ్యామేజీ అయింది. వరదలు తగ్గిన వెంటనే రిపేరు పనులు మొదలుపెట్టినా, అప్పటికే రెండో జోన్ లో పంటలకు సాగు నీరందించాల్సిన పరిస్థితి రావడంతో పూర్తి స్థాయిలో యూటీ నిర్మించకుండానే కాల్వ కట్టలను పటిష్టం చేశారు.

 ఆ తర్వాత వర్షాలు వస్తే యూటీ సమీపంలో నీరు నిలవకుండా పెద్ద మోటార్లతో ఎత్తిపోశారు. ఇప్పుడు పంటల సీజన్ ముగియడంతో అప్పట్లో డ్యామేజీ అయిన వాటిని పునర్నిర్మిస్తున్నారు. మొత్తం రూ.14 కోట్లతో యూటీని పూర్తి స్థాయిలో నిర్మించడంతో పాటు గండ్లు పడిన ప్రాంతంలో 300 మీటర్ల మేర కాల్వ లైనింగ్ పనులను కూడా చేయనున్నారు. యూటీ కోసం 120 టన్నుల స్టీల్ ను ఉపయోగిస్తున్నారు. 

11 ఏండ్ల తర్వాత జంగిల్ క్లియరెన్స్..

రాష్ట్రం వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో తొలిసారిగా నాగార్జున సాగర్ ప్రధాన కాల్వలపై జంగిల్ క్లియరెన్స్ కు నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 53 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వ ఉంది. దీనిపై సర్కారు కంప చెట్లు పెరగడంతో అడవులను తలపిస్తున్నాయి. ప్రతియేటా జంగిల్ క్లియరెన్స్ తో పాటు కాల్వలో పూడిక తీయడం కోసం ప్రపోజల్స్ పెట్టినా నిధులు లేకపోవడంతో ఆ ప్రతిపాదనలను పక్కనపెట్టారు. అయితే గతేడాది సెప్టెంబర్ లో వరదలు వచ్చి గండ్లుపడిన సమయంలో ఈఎన్సీ (ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్) సహా, ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించి కాల్వలను పరిశీలించారు. 

ఈ సమయంలో డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీసి కాల్వకట్టలను గమనించడంతో జంగిల్ క్లియరెన్స్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఎట్టకేలకు దాదాపు రూ.45 లక్షలతో కంప చెట్లు తొలగించేందుకు అనుమతులిచ్చారు. వారం పది రోజుల్లోనే ఈ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. మరోవైపు నాయకన్ గూడెం దగ్గర షట్టర్ల రిపేర్లు, ఎస్కేప్ లాకుల దగ్గర కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. ఇక నాయకన్ గూడెం దగ్గర రంగుల బ్రిడ్జి (ఆక్విడెక్ట్) నుంచి జిల్లాలోని ప్రధాన కాల్వలో ఉన్న పూడికను కూడా తొలగించనున్నారు.  

జులై 10లోగా కంప్లీట్​ చేసేలా..

ఖమ్మం జిల్లాలో సాగర్ కాల్వలకు సంబంధించి పాలేరులో మినీ హైడల్ కేంద్రం దగ్గర కట్టకు గండి పడగా, రెండు చోట్ల కోతకు గురైంది. ప్రధాన కాల్వకు అండర్ టన్నెల్ ప్రాంతంలో కాకుండా 300 మీటర్ల పరిధిలోనే రెండు చోట్ల గండ్లు పడ్డాయి. ప్రధాన కాల్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వైపు 30 మీటర్ల మేర గండి పడింది. ఇవే కాకుండా మొదటి జోన్ పరిధిలో కాగిత రామచంద్రాపురంలోని రంగుల బ్రిడ్జి దగ్గర, ఎస్కేప్ రెగ్యులేటర్ సమీపంలో రెండు చోట్ల గండ్లు పడ్డాయి.

 వీటన్నింటికీ కాల్వ కట్టలతో పాటు అడుగు భాగంలో కూడా పటిష్టంగా లైనింగ్ చేయనున్నారు. మళ్లీ వానాకాలం పంటలకు ఆగస్టు రెండో వారంలో సాగర్ నీటిని విడుదల చేయనుండగా, ఈ రిపేర్ పనులన్నింటిని జులై 10 నాటికల్లా పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్టు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో 2.53 లక్షల ఎకరాల్లో సాగర్ ఆయకట్టు ఉంది. ఈ గండ్ల పూడ్చివేత, లైనింగ్ పనులు పూర్తయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయకట్టుకు సాగు నీరు అందనుంది.