
- భద్రతాబలగాలు చేస్తుంది నిజమైన ఎన్‌కౌంటరో.. ఫేకో తెలియడం లేదు
- పోలీసుల తూటాలకు బాలికలు, గర్భిణులను బలవుతున్రు
- పీస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్
వరంగల్, వెలుగు : శత్రుదేశంతో శాంతి చర్చలు జరిపేటోళ్లు.. భారత పౌరులతో చర్చలు జరిపితే తప్పేంటని పీస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. ‘మావోయిస్టులతో శాంతి చర్చలు’ అంశంపై బుధవారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ.. చత్తీస్‍గఢ్ అడవుల్లో జరుగుతున్నది ఎన్‌కౌంటరో.. కాదో తెలియడం లేదన్నారు. పోలీసుల తూటాలకు ఓచోట బాలిక మరణిస్తే.. మరోచోట గర్భిణి చనిపోయిందన్నారు.
అటవీ ప్రాంతాల్లో మహిళలు బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారన్నారు. తాము శాంతి చర్చలకు పిలుపునిస్తే మావోయిస్టులు స్పందించి కాల్పుల విరమణ ప్రకటించారన్నారు. చర్చలకు ఇతర రాజకీయ పార్టీలు సైతం ఒప్పుకున్నా.. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదన్నారు. మావోయిస్టులు చర్చలకు ఒప్పుకున్నాక.. వేలాది మంది బలగాలతో దాడి చేసి చంపడం ధర్మమేనా ? అని ప్రశ్నించారు.
తాను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో మాట్లాడే ప్రయత్నం చేశానని.. బండి సంజయ్ మాత్రం చర్చల్లేవని ఓపెన్‍గా చెబుతున్నారన్నారు. రివార్డ్ ఉన్న నేతలను చంపేసి.. ఆ డబ్బులను పోలీసులకు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. ‘మీరు నక్సల్స్ రహిత భారతదేశం తీసుకొస్తే.. ప్రజలు బీజేపీ ముక్త్ భారత్ తీసుకొస్తారని’ చెప్పారు. సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, ప్రజా సంఘాల నేతలు నర్సింగరావు, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ అన్వర్, జగదీశ్, సోమ రామ్మూర్తి, జైసింగ్ రాథోడ్, సాయిని నరేందర్, చాప బాబుదొర, రాజేందర్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.