ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కామారెడ్డి టౌన్, వెలుగు : కుటుంబ కలహాలతో ఏఆర్ కానిస్టేబుల్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి మండలంలోని గర్గుల్​సమీపంలో జరిగింది.  కామారెడ్డి రూరల్ సీఐ రామన్ వివరాల ప్రకారం.. రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన రేకులపల్లి జీవన్​రెడ్డి ( 38) ఏఆర్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఇతడికి 12 ఏండ్ల క్రితం రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన చందనతో పెండ్లి జరిగింది. వీరికి  మోక్ష, కృతిక ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య  విభేదాలు తలెత్తాయి.  2 ఏండ్ల క్రితం భర్తపై ముస్తాబాద్​ పోలీస్ స్టేషన్​లో భార్య ఫిర్యాదు చేసింది.  

భార్య పుట్టింటి నుంచి రాకపోవటంతో మనస్తాపానికి గురయ్యేవాడు. సోమవారం కామారెడ్డికి డ్యూటీ వెళ్తున్నానని చెప్పి బయలు దేరారు. మార్గమధ్యంలో  గర్గుల్ సమీపంలోని రాధస్వామి సత్సంగ్ వెనుక ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.    తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.  స్థానికులు గమనించి దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనా స్థలాన్ని ఎస్పీ రాజేశ్​చంద్ర పరిశీలించి మృతుడి కుటుంబీకులతో వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. మృతుడి తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.