బెంగాల్ నటి అర్పిత వెహికల్స్ కోసం ఈడీ వేట

బెంగాల్ నటి అర్పిత వెహికల్స్ కోసం ఈడీ వేట

కోల్​కతా: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ తన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లలోనూ భారీ ఎత్తున క్యాష్ ను దాచి ఉంచినట్లు ఎన్ ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు భావిస్తున్నారు. అర్పితకు చెందిన ఆ నాలుగు కార్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) ద్వారా టీచర్ల రిక్రూట్ మెంట్​కు సంబంధించిన స్కాంలో  ఆరోపణలు ఎదుర్కొంటున్న చటర్జీని ఇటీవల అరెస్ట్ చేసిన ఈడీ.. ఆయన సన్నిహితురాలు అర్పితకు చెందిన మూడు అపార్ట్​మెంట్లలో రెండ్రోజులు సోదాలు చేసింది. దీంతో రూ. 50 కోట్లకు పైగా నోట్ల కట్టలు, 5 కిలోల బంగారం బయటపడ్డాయి. అర్పితకు చెందిన నాలుగు లగ్జరీ కార్లలోనూ భారీగా క్యాష్ ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ కార్ల కోసం వెతుకుతున్నట్లు శుక్రవారం ఈడీ వర్గాలు 
వెల్లడించాయి.  

ఆస్పత్రి వద్ద హైడ్రామా 

కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కోల్​కతా జోకా ఏరియాలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చటర్జీ, అర్పితకు ఈడీ అధికారులు హెల్త్ చెకప్ చేయించారు. ఇద్దరినీ వేర్వేరుగా ఆస్పత్రికి తీసుకువచ్చి చెకప్ చేయించి, తిరిగి తీసుకెళ్లారు. ఆస్పత్రిలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వీల్ చైర్ లో నుంచే చటర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో తమను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తన సస్పెన్షన్​ సరైనదో, కాదో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఇక ఆస్పత్రి వద్ద కారు దిగేందుకు అర్పిత మొండికేసింది. ఆమె ఏడుస్తూ బయటకు రాకపోవడంతో పోలీసులు బలవంతంగా దించి వీల్ చైర్ లో ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరిగిందన్నారు. 

నిర్దోషిగా తేలితేనే మళ్లీ పార్టీలోకి: అభిషేక్ బెనర్జీ

అర్పితకు చెందిన రెండు అపార్ట్ మెంట్లలో జరిగిన తనిఖీల్లో ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా నోట్ల కట్టలు, ఐదు కిలోల బంగారం అధికారులు సీజ్ చేశారు. ఈడీ కేసులో అరెస్ట్ కావడం, కోట్ల కొద్దీ నోట్ల కట్టలు బయటపడటంతో పార్థ చటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గురువారం టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను పార్టీ పదవుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఈడీ కేసులో నిర్దోషిగా తేలితే తప్ప ఆయనకు ఇక పార్టీ తలుపులు తెరుచుకోవని శుక్రవారం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ స్పష్టంచేశారు. 

అందరి పేర్లను బయటపెట్టాలె: మిథున్ చక్రవర్తి 

ఎస్ఎస్సీ స్కాంలో పార్థ చటర్జీని మాత్రమే బలిపశువును చేస్తున్నారని, ఈ స్కాంలో ఉన్న మిగతా అందరి నేతల పేర్లనూ ఆయన బయటపెట్టాలని బీజేపీ నేత మిథున్ చక్రవర్తి అన్నారు. ఈడీ సోదాల్లో పట్టుబడిన డబ్బుకు పార్థ చటర్జీ కేర్​టేకర్​గా మాత్రమే ఉన్నాడని, ఆయన నిర్భయంగా అందరి పేర్లనూ చెప్పాలన్నారు. ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమత రాజీనామా చేయాలంటూ లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి.

పదేండ్ల కింద రూ.6,300..

పదేండ్ల కింద తన వద్ద కేవలం రూ. 6,300 క్యాష్ మాత్రమే ఉన్నట్లు పార్థ చటర్జీ ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొ న్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్​లో ఇంత తక్కువ మొత్తం ఉన్నట్లు చూపిన ఆయన.. 2021 ఎన్నికల అఫిడవిట్​లో మాత్రం అంతకు 23 రెట్లు అధికంగా రూ. 1,48,676 క్యాష్​ ఉన్నట్లు చూపారు. అయితే, ఇప్పటికే ఆయన సన్నిహితురాలి ఇండ్లలో  రూ. 50 కోట్లకు పైగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.