మెల్‌బోర్న్: ఆరు నెలల కిందట జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లో ఇండియా టీమ్ చీటింగ్ చేసి.. తమపై సిరీస్ గెలిచిందని కెప్టెన్ టిమ్ పైన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనవసర విషయాలతో ఏకాగ్రతను దెబ్బతీస్తూ తమను పక్క దారి పట్టించిందని ఆరోపించాడు. ‘టీమిండియా మమ్మల్ని పక్కదారి పట్టించిన విధానం అద్భుతంగా ఉంది. ఏమాత్రం అవసరం లేని విషయాలతో ఏకాగ్రత చెడగొట్టింది. చాలా సందర్భాల్లో మేం ఇలాంటి విషయాలకు బోర్లా పడ్డాం. ఈసారి కూడా అదే జరిగింది. దీనికి మంచి ఉదాహరణ చెబుతా. గబ్బాలో నాలుగో టెస్ట్ ఆడలేమని రహానె సేన చెప్పింది. దీంతో మ్యాచ్ ఎక్కడ జరుగుతుందోనని మేం ఆందోళనలో పడ్డాం. ఫలితంగా బౌలింగ్ స్ట్రాటజీలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ రెండు రోజుల్లోనే మాట మార్చిన టీమిండియా అక్కడే మ్యాచ్ ఆడటానికి సిద్ధమైంది. దీంతో మేం సరైన పోటీ ఇవ్వలేకపోయాం. మేం మంచి స్థితిలో లేనప్పుడు టీమిండియా చీట్ చేసి సిరీస్ గెలిచింది’ అని పైన్ వ్యాఖ్యానించాడు.
