రేపటి విచారణకు రాలేను.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

రేపటి విచారణకు రాలేను.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి లేఖ రాశారు. రేపు (మే22) అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యం దృష్ట్యా హాజరుకాలేని అవినాష్ రెడ్డి లేఖలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సహ నిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి‌ పదే పదే సీబీఐ విచారణకు డుమ్మా కొడుతున్నారు. విచారణకు రావాల్సిందేనని సీబీఐ నోటీసులు ఇవ్వడం.. రాలేనని ఏదో ఒక కారణం చెబుతూ ప్రతిసారీ డుమ్మా కొట్టడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు వస్తున్నట్లు చెప్పిన అవినాష్ ఆఖరి నిమిషంలో రాకపోవడంతో ఈ వ్యవహారాన్ని సీబీఐ సీరియస్‌గా తీసుకుంది. సోమవారం నాడు (మే-22న) విచారణకు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని అవినాష్‌కు 160 CRPS కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనినాష్ తల్లికి చికిత్స కొనసాగుతోంది. తల్లి అనారోగ్యంతో ఉన్నందున విచారణకు 10రోజలు సమయాన్ని కోరారు అవినాష్ రెడ్డి. 

వాస్తవానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఈ నెల 22 న సీబీఐ ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే, ఆయన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు అవినాష్ రెడ్డి. తన తల్లికి గుండె ఆపరేషన్ ఉందని వైద్యులు చెప్పారని, ఆమె కోలుకోవడానికి వారం నుంచి 10 రోజుల సమయం పడుతుందని లేఖలో పేర్కొన్నారు అవినాష్ రెడ్డి. తన తల్లి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు విచారణకు హాజరుకాలేనని చెప్పారు. ఆ తరువాత విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే, అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి.

మానవత్వ కోణంలో..

ఈ నెల 19న హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ బయల్దేరి వెళ్లినప్పుడు సీబీఐ అధికారులు రెండు కార్లలో వెంబడించారు.  మానవత్వ కోణంలో ఆలోచించిన సీబీఐ విచారణకు రాలేనని చెప్పినా సరేనని సైలెంట్ అయ్యింది. ఇవాళ( మే 21) అవినాష్ లేఖ రాసినా.. ఇంతవరకూ సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం.. పైగా సీబీఐ బృందం కర్నూల్‌కు బయల్దేరినట్లు వస్తున్న వార్తలతో అటు ఎంపీ అభిమానులు, అనుచరుల్లో.. ఇటు వైసీపీ అధిష్ఠానంలో నరాలు తెగేలా టెన్షన్ మొదలైందట. మరోవైపు.. వైసీపీ కీలక నేతలు.. న్యాయ నిపుణులతో భేటీ అయ్యి దీనిపై ఎలా ముందుకెళ్లాలి..? అరెస్ట్ కాకుండా ఏం చేయాలి..? అని అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కర్నూల్‌కు సీబీఐ

హైదరాబాద్ నుంచి హుటాహుటిన సీబీఐ బృందం కర్నూల్‌కు బయల్దేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కర్నూల్‌లోని విశ్వభారతి ఆస్పత్రిలో అవినాష్ తల్లి లక్ష్మమ్మ చికిత్స తీసుకుంటున్నారు. తన తల్లి దగ్గరే ఎంపీ ఉండి అన్నీ చూసుకుంటున్నారు. అందుకే ఆయనున్న ఆస్పత్రికే సీబీఐ బృందం వెళ్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్ లేఖకు సీబీఐ నుంచి స్పందన రాకపోగా అధికారులే కర్నూల్‌కు వెళ్తుండటంతో కచ్చితంగా  కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు.. అవినాష్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున కర్నూలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయో ఏంటో.. చూడాలి మరి.