- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు
- ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
- మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
- మేడారంలో అభివృద్ధి పనులు, భద్రతా ఏర్పాట్ల పరిశీలన, సమీక్ష
ములుగు, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను సమన్వయంతో సక్సెస్ చేద్దామని మల్టీ జోన్ఐటీ చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ముందుగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించిన ఆయన ఆ తర్వాత అభివృద్ధి పనులు, భక్తుల భద్రత ఏర్పాట్లను పరిశీలించగా.. జిల్లా ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్వివరించారు.
అనంతరం రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, ఉమ్మడి వరంగల్జిల్లా ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈనెల 28 నుంచి 31వరకు జరిగే మేడారం జాతరను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. కోటికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు అమ్మవార్ల దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతరకు ఎంత సిబ్బంది అవసరమైతే అంత మందిని తీసుకోవాలని, బందోబస్తుకు వెనకాడొద్దని స్పష్టంచేశారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా, పోలీసు శాఖకు చెడ్డపేరు రాకుండా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మేడారం దారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ నిత్యం పర్యవేక్షించాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ లు కావొద్దని, జాతరకు వచ్చి వెళ్లే వాహనాల దారి మళ్లింపుపై ప్లానింగ్ ఉండాలని ఆదేశించారు.
పూజారులు అమ్మవార్ల వస్త్రాలను ఐజీకి అందజేశారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎస్పీ పి.శబరీష్, , భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేశ్గీతే బాబాసాహెబ్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, అడిషనల్ ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
