చిరుత చనిపోయిందా ? చంపేశారా ?.. ఖమ్మం జిల్లా అడవుల్లో కళేబరం కాల్చివేత

చిరుత చనిపోయిందా ?  చంపేశారా ?.. ఖమ్మం జిల్లా అడవుల్లో కళేబరం కాల్చివేత
  •  పులిగుండాల అడవుల్లో ఏడాది కింద కళేబరం కాల్చివేత
  • స్థానికులు సమాచారంతో గుట్టుచప్పుడు కాకుండా కాల్చేసిన బీట్ ఆఫీసర్లు
  • ఘటనపై గోప్యతను పాటించడంతో అనుమానాలు 
  • తాజాగా స్మగ్లర్ ​ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన 
  • ఇద్దరు బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేసిన ఖమ్మం డీఎఫ్ఓ 

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా తల్లాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఏడాది కింద చిరుత మృతి, కాల్చివేత ఘటనపై  బీట్ ఆఫీసర్లు గోప్యత పాటించడంపై అనుమానాలు రేకెత్తాయి. ఏడాది తర్వాత అటవీశాఖ ఉన్నతాధికారులకు ఓ స్మగ్లర్​ కంప్లయింట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. అంతర్గత దర్యాప్తు పూర్తి చేసిన అధికారులు బాధ్యులైన ఇద్దరు బీట్ ఆఫీసర్లను శుక్రవారం సస్పెండ్ చేశారు.

 అయితే, చిరుత మృతిపై తెలిసిన వెంటనే బీట్ ఆఫీసర్లు రహస్యంగా ఎందుకు ఉంచారనేది చర్చనీయాంశమైంది. అనారోగ్యంతో చిరుత చనిపోయి ఉంటుందా..?  లేక వేటగాళ్లు చంపేశారా..? అనే ప్రశ్నలు తలెత్తాయి. కళేబరాన్ని కాల్చిన స్థలం వద్ద లభించిన ఆనవాళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించామని, పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఫారెస్ట్ ఆఫీసర్లు తెలిపారు.  

కాగా.. ఖమ్మం జిల్లా అటవీ శాఖ నిత్యం వివాదాలకు కేరాఫ్ గా మారింది. మూడు నెలల కింద రూ. కోట్ల విలువైన సండ్ర కలపను ఫేక్​ పర్మిట్లతో తరలిస్తూ పట్టుబడడం సంచలనమైంది. గత నెలలో సత్తుపల్లి అర్బన్​పార్క్ లో తుపాకీతో దుప్పుల వేట ఘటన వెలుగులోకి రాగా.. కేసులో నలుగురు నిందితులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 

అసలేం జరిగిందంటే.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాల్లో పులిగుండాల అటవీ విస్తరించి ఉంది. కల్లూరు మండలం రాళ్లబంజర సమీపంలో లక్ష్మీపురం బీట్ పరిధిలో గతేడాది జనవరిలో చిరుత పులి మృతి చెందగా.. ఓ కలప స్మగ్లర్​ చూసి తనకు సన్నిహితంగా ఉండే అటవీ  అధికారికి సమాచారం అందించాడు. ఇది బయటపడితే తమకు ఇబ్బంది అవుతుందనుకుని ఫారెస్ట్ అధికా రులు చిరుతపులి కళేబరం ఆనవాళ్లు లేకుండా కాల్చివేశారు. 

రూల్స్ మేరకు ముందుగా ఉన్నతాధికారులకు తెలిపిన అనంతరం పంచనామా చేయాలి. కానీ అలాంటివేవీ చేయలేదు. చిరుత కళేబరం కాల్చేయడం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటించడంపై అనుమానాలు తలెత్తాయి.

 
అనారోగ్యంతో చిరుత చనిపోతే కాల్చివేశారా..? లేక చర్మం, గోర్ల కోసం చిరుతను వేటగాళ్లు చంపేశారా..? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో అధికారులకు సమాచారమిచ్చిన స్మగ్లర్​కు, ఫారెస్ట్ అధికారికి మధ్య పంపకాల తేడా రావడంతోనే తాజాగా..  వాట్సప్​లో గత నెల 28న డీఎఫ్​ఓ సిద్ధార్థ్ విక్రమ్​సింగ్, ఇతర ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేసినట్టు సమాచారం. అప్పటి ఘటనకు చెందిన ఫొటోలు, వీడియోలు కూడా పంపించినట్టు తెలుస్తోంది. 

ఇద్దరు బీట్​ ఆఫీసర్లు సస్పెన్షన్

స్మగ్లర్ కంప్లయింట్ ద్వారా  టాస్క్ ఫోర్స్ విచారణకు డీఎఫ్ వో ఆదేశించారు.  ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుతను కాల్చిన చోట ఎముకలు, తోక ఆనవాళ్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్​లోని ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపించింది. 

చిరుత వయస్సు, ఎప్పుడు చనిపోయింది, సహజ మరణమా, ఎవరైనా చంపేశారా..? ఇలా పూర్తిస్థాయి వివరాలు రిపోర్ట్ వచ్చాక తెలుస్తాయి. టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీ ప్రాథమిక రిపోర్ట్ ను డీఎఫ్ఓకు అందించింది.  శుక్రవారం రాళ్ల బంజరు బీట్ ఆఫీసర్లు భీమా, భరత్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై డీఆర్ఓ పాత్రపైనా ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లోనే విషయం తెలిసిన వ్యక్తి, ఇన్ని నెలలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..? అతనికి, ఫారెస్ట్ కింది స్థాయి సిబ్బందికి ఎలాంటి సంబంధాలున్నాయి..? ఇప్పుడు ఎందుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారనేది కూడా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్​ భీమా నాయక్ శుక్రవారం ఖమ్మంలో పర్యటించారు. చిరుత మృతి, ఆ తర్వాత ఎంక్వైరీ తీరుపై డీఎఫ్​ఓతో చర్చించినట్టు తెలుస్తోంది.

పెద్దపులి దాడిలో గేదె మృతి!

కరీంనగర్​ రూరల్ : కరీంనగర్​ రూరల్​మండలం జూబ్లీనగర్​లో పులి దాడిలో గేదె మృతి చెందింది.  కొద్ది రోజులుగా  బహుదూర్​ ఖాన్​పేట, జూబ్లీనగర్, చొప్పదండి మండలం వెదురుగట్ట, రుక్మాపూర్​ఏరియాల్లో పెద్దపులి సంచరించిందని రైతులు చెప్పడంతో  ఫారెస్ట్​ ఆఫీసర్లు పొలాల్లో పాదముద్రలను గుర్తించారు. గత నెల 28న జూబ్లీనగర్ శివార్లలోని మలగుట్ట వద్ద బోగండ రాయుడుకు చెందిన గేదెపై దాడి చేసింది. 

ఏదో జంతువు దాడి చేసి ఉంటుందని భావించి చికిత్స చేయించారు.  గుట్ట పరిసరాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో ఫారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. పులి దాడి కారణంగా గేదె చనిపోయిందని రైతు కంప్లైంట్​చేయగా.. కళేబరానికి పోస్ట్​మార్టం చేసి నివేదికను ఫారెస్ట్​ ఆఫీసులో అందించాలని కరీంనగర్‌లోని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌ని కోరుతూ ఎఫ్​ఆర్​వో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌కు లేఖ రాశారు. 

జంగాలపల్లి అడవిలో పులి సంచారం

కొత్తగూడ(గంగారం) : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి ఈస్ట్​బీట్​లో పులి పాద ముద్రలను ఫారెస్ట్​ఆఫీసర్లు గుర్తించారు. గూడూరు ఎఫ్​డీవో చంద్రశేఖర్,ఎఫ్ఆర్ వో మంగిలాల్, డీఆర్ వో సతీశ్, బీట్​ ఆఫీసర్లు సతీశ్,విష్ణు టీమ్ పులి తిరిగిన ప్రాంతాలను శుక్రవారం పరిశీలించా రు. పులి మహదేవుని గూడెం నుంచి జంగాలపల్లి వైపు వచ్చినట్లు గుర్తించారు. 

ఎఫ్​డీవో చంద్రశేఖర్​మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా కొత్తగూడ రేంజ్ పరిధి చౌక్​బోడ్​ఏరియాలో తిరిగిన పులి గంగారం మండలం జంగాలపల్లి మహదేవుని గూడెం అడవిలో సంచరిస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. సమీప గ్రామాల ప్రజలు, పశుల కాపర్లు  అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.  పులికి ఎలాంటి హాని కలిగించవద్దని, రాత్రి వేళలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. పులి గుండాల అడవి వైపు వెళ్తుందని ఫారెస్ట్ ఆఫీసర్లు పేర్కొన్నారు.  

గుండాల మండలంలో పెద్ద పులి భయం 

గుండాల : భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో పెద్దపులి భయం పట్టుకుంది. దామరతోగు, పోసాపురం, రోల్లగడ్డ అడవి ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లిన కాపరులకు పెద్దపులి గాండ్రింపులు వినిపించాయి. దీంతో  గ్రామాల్లో చెప్పడంతో జనాల్లో భయాందోళన నెలకొంది. గత ఏడాది ఇదే సమయంలో పెద్దపులి జగ్గయిగూడెంలో పత్తి తీసే కూలీలకు కనిపించగా కేకలు వేస్తూ పరుగులు తీశారు. 

మరుసటి రోజు ఆళ్లపల్లి మండలం సింగారం అడవుల్లో పెద్దపులిని చూశామని రైతులు చెప్పినా ఆఫీసర్లు నమ్మలేదు. మూడో రోజు అదే మండలం పెద్దూరులో ఎద్దును చంపడంతో ఫారెస్ట్ ఆఫీసర్లు వెళ్లి పెద్దపులి దాడి చేసినట్లు కన్ఫర్మ్ చేశారు. అనంతరం కనిపించకుండా పోయిన పెద్దపులి మళ్లీ మండలంలో కనిపించడంతో జనం పొలం పనులకు, పశువులను మేపేందుకు వెళ్లాలంటే జంకే పరిస్థితి నెలకొంది. 

పెద్దపులి సంచారంపై గుండాల ఫారెస్ట్ రేంజర్ నరసింహారావు వివరణ కోరగా.. శుక్రవారం సాయంత్రానికి గంగారం అడవి నుంచి గుండాలవైపు పెద్దపులి వచ్చినట్టు గుర్తించామని చెప్పారు. శనివారం పూర్తి వివరాలు తెలిస్తాయని పేర్కొన్నారు.