జీహెచ్ఎంసీలో పన్నుల వసూలు క్యాష్ లెస్.. ఎందుకంటే..

జీహెచ్ఎంసీలో పన్నుల వసూలు క్యాష్ లెస్.. ఎందుకంటే..
  • ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కలెక్షన్స్ అంతా ఆన్​లైన్​లోనే..
  • డీడీ, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు 
  •  విలీనమైన 27 లోకల్​ బాడీల్లోనూ అమలు  

హైదరాబాద్​సిటీ, వెలుగు : జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో పన్నుల వసూలు విధానంలో కీలక మార్పు చోటుచేసుకున్నది. ఇకపై పన్నుల చెల్లింపులు మరింత పారదర్శకంగా, వేగంగా సాగేలా క్యాష్‌‌‌‌లెస్‌‌‌‌ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇక నుంచి ఆస్తి పన్ను మొదలుకుని  అన్ని రకాల ట్యాక్స్​లను ఆన్​లైన్​ద్వారానే స్వీకరించనున్నారు. ఆస్తి పన్నుల చెల్లింపులతో పాటు ఏమైనా సవరణలున్నా అధికారులను కలవకుండానే ఆన్​లైన్​లోనే పరిష్కరించేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. 

ఎందుకంటే..

బల్దియా ఉన్నతాధికారులు జీఐఎస్ సర్వే ద్వారా సిటీలోని14 లక్షల ఆస్తులను అసెస్మెంట్ చేయగా లక్షకు పైగా ఆస్తులు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ కన్నా తక్కువ కడుతున్నట్టు అధికారులు గుర్తించారు. కొందరు ట్యాక్స్ ఇన్​స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు భవన యజమానులతో చేతులు కలిపి బిల్డింగ్ అసెస్మెంట్ తక్కువ చూపి లంచాలు తీసుకుంటూ బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుసుకున్నారు. కొందరు బిల్ కలెక్టర్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసి రశీదు ఇవ్వకుండా ఆ డబ్బులను కూడా సొంత ఖర్చులకు వాడినట్లు గుర్తించారు. మరికొందరు చెల్లింపులు చేసినా రికార్డుల్లో నమోదు చేయట్లేదు. 

పాత అసెస్మెంట్ విలువలను చూపిస్తూ పన్ను తగ్గిస్తామంటూ డీల్స్ చేసుకుంటున్నారు. పెండింగ్ పన్నులు తగ్గిస్తామంటూ దండుకుంటున్నారు. కమర్షియల్ భవనాలను రెసిడెన్షియల్ ఇండ్లుగా చూపించడం, ఫ్లోర్ ఏరియా తక్కువగా చూపించడం లాంటివి చేస్తున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఆస్తి పన్ను వసూళ్లు, సమస్యల పరిష్కారాన్ని పూర్తిగా ఆన్‌‌‌‌ లైన్‌‌‌‌ లోకి తీసుకొచ్చారు. 

బిల్డింగ్ ఓనర్లకు బిల్ కలెక్టర్లకు సంబంధం లేకుండా...

ఆస్తిపన్నుల చెల్లింపులతో పాటు ఆస్తి రిజిస్ట్రేషన్, అసెస్మెంట్ సవరణలు, డ్యూ క్యాల్కులేషన్, గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్, పరిష్కారం అంతా జీహెచ్ఎంసీ అధికారిక ఆన్​లైన్​ పోర్టల్ లేదా జీహెచ్ఎంసీ యాప్ ద్వారానే జరగనున్నాయి. దీనివల్ల ట్యాక్స్ ఇన్​స్పెక్టర్​, బిల్ కలెక్టర్లకు భవన యజమానితో ప్రత్యక్ష సంప్రదింపులు ఉండవు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లకి సంబంధించి  గతంలో లెక్క బిల్ కలెక్టర్లకు నగదు  ఇచ్చే అవకాశం ఇక ఉండదు. 

ఒకవేళ బిల్ కలెక్టర్లు ఇంటికి వచ్చినా నగదు తీసుకోరు. గూగుల్ పే, ఫోన్ పే తదితర యూపీఐ పేమెంట్స్ తో పాటు  క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, డీడీ ద్వారా చెల్లించొచ్చు. ఎవరైనా అధికారులు ఆన్​లైన్​విధానాన్ని అతిక్రమిస్తే డిసిప్లినరీ యాక్షన్ లేదా సస్పెన్షన్ తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.  

విలీన లోకల్ బాడీల్లో పక్కాగా అమలు

జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొన్నటి దాక మ్యాన్ వల్ గానే ట్యాక్స్​కలెక్ట్ చేశారు.  కానీ, ఇక నుంచి విలీనమైన ప్రాంతాల్లో కూడా క్యాష్​లెస్​ విధానాన్ని అమలు చేయనున్నారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలోనూ కొంత కాలంగా ఈ విధానం కొనసాగుతున్న పక్కాగా అమలు కావడంలేదు. అయితే, ఇక నుంచి ఇక్కడ కూడా వందశాతం అన్ లైన్ చెల్లింపులు చేయాలని ఆదేశించారు.