షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయొచ్చు.. తీర్పు వెల్లడించిన హైకోర్టు

షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయొచ్చు.. తీర్పు వెల్లడించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బెయిల్​పై విడుదలైన నిందితుడు తిరిగి అదే తరహా నేరాలకు పాల్పడినా, కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినా బెయిల్​ను రద్దు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మహిళను మోసం చేసి, బెదిరించారన్న కేసులో అరెస్టయి బెయిల్​పై విడుదలైన అనంతరం షరతులను ఉల్లంఘించారన్న కారణంతో కింది కోర్టు బెయిల్​ను రద్దు చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వరంగల్ జిల్లా లోని నాగారం మండలానికి చెందిన బానోత్ రాహుల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ జె.శ్రీనివాసరావు సోమవారం విచారణ చేపట్టారు. 

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారైన మహిళ రెండోసారి చేసిన ఫిర్యాదుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మే 14న దాడి జరిగిందని చెబుతూ అదే నెల 29న ఫిర్యాదు చేశారని, ఫిర్యాదులో జాప్యానికి కారణాలను వెల్లడించలేదని పేర్కొన్నారు. మహిళ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. మే 7వ తేదీ నుంచే పిటిషనర్ ఆమెను బెదిరిస్తున్నారని, తన వద్ద ఉన్న ఫొటోలు, ప్రైవేట్​వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని హెచ్చరించడంతో ఆమె అతడిని కలవడానికి వెళ్లిందన్నారు. ఆ సమయంలో పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు అతని సోదరులు ఆమెపై దాడి చేశారని చెప్పారు. 

తొలుత ఖైరతాబాద్ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసి, గాంధీ దవాఖానలో చికిత్స పొందిన అనంతరం పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్ పరిధి కారణంగా పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. బెయిల్​పొందిన తర్వాత నిందితుడు తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడటం, సాక్షులను లేదా ఫిర్యాదుదారులను బెదిరించడం, కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించడం వంటివి బెయిల్​ రద్దుకు కారణాలవుతాయని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించింది. ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారైన మహిళను బెదిరించడం ద్వారా పిటిషనర్ బెయిల్​షరతులను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బెయిల్​ను రద్దు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.  అనంతరం పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.