- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్రం కూడా నిధులతోపాటు మ్యాచింగ్ గ్రాంట్ల మంజూరులో సహకరిస్తోందన్నారు. కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
సోమవరం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాంనగర్ డివిజన్లో రూ.1.5 కోట్లతో చేపట్టనున్న బాక్స్ టైప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుతం అమృత్ పథకం కింద రూ.17 కోట్లు, యూసీఎఫ్ స్కీం ద్వారా రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి పనులు ప్రారంభిస్తుంటే కొందరు వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
నగరంలోని గల్లీగల్లీలో అంతర్గత రహదారుల నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 నుంచి 90 శాతం పూర్తయి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలుపుతామన్నారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
