క్రిమీలేయర్ తో జరిగిన అన్యాయాలు సరిదిద్దాలి..ప్రధానికి ఎంపీ ఆర్. కృష్ణయ్య లేఖ

క్రిమీలేయర్ తో జరిగిన అన్యాయాలు సరిదిద్దాలి..ప్రధానికి ఎంపీ ఆర్. కృష్ణయ్య లేఖ

ముషీరాబాద్,వెలుగు: క్రిమీలేయర్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పును స్వాగతిస్తున్నామని, అయితే 2015 నుంచి బీసీలకు జరిగిన అన్యాయాలను కూడా సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పీఎం నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఈ అంశంపై ప్రధానమంత్రికి లెటర్​రాశారు. ప్రస్తుత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, వ్యవసాయ ఆదాయాన్ని క్రిమీలేయర్ ఆదాయ పరిమితి నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసిందన్నారు. 

2015 నుంచి క్రిమీలేయర్ రూల్​ కారణంగా ఉద్యోగ నియామకాల్లో బీసీలకు జరిగిన అన్యాయాలను కూడా సమీక్షించి, అర్హులైన వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రూల్​వల్ల ప్రతి ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ నియామకాల్లో 20 నుంచి 30 మంది వరకు బీసీ అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎన్సీసీ, మహిళా రిజర్వేషన్లకు లేని క్రిమిలేయర్ రూల్​బీసీలకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు.