- బెడ్ల సంఖ్య ఆధారంగా దవాఖానల్లో సదుపాయాలుండాలి: మంత్రి దామోదర
- టీవీవీపీ పునర్వ్యవస్థీకరణపై సమీక్ష
హైదరబాద్, వెలుగు: హాస్పిటళ్ల స్థాయిని బట్టి అక్కడ అందించే వైద్యసేవల పరిధిని ఖరారు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల వైద్యసేవలను వారి సొంత జిల్లాల్లోనే అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా పేషెంట్లు హైదరాబాద్కు, మెడికల్ కాలేజీలకు పరుగులు పెట్టే పరిస్థితిని తగ్గించేందుకే సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
సోమవారం సెక్రటేరియెట్ లో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్(టీవీవీపీ) పునర్వ్యవస్థీకరణపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కి) రూపొందించిన అధ్యయన నివేదికను ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లలో మౌలిక వసతులు, స్పెషలిస్ట్ సేవలు, వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ సదుపాయాలు పక్కాగా ఉండాలని ఆదేశించారు.
30, 50, 100, అంతకంటే ఎక్కువ బెడ్ల సామర్థ్యం ఉన్న హాస్పిటళ్లకు అనుగుణంగా స్పెషాలిటీ విభాగాలు, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్ లు, ఇతర సదుపాయాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఏ హాస్పిటల్లో ఏయే స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి, ఎక్కడెక్కడ డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందితోపాటు పరికరాలు అవసరమో సమీక్షించాలన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(ఐపీహెచ్ఎస్) రూల్స్ ప్రకారమే హాస్పిటళ్లను అభివృద్ధి చేయాలని, సిబ్బంది కొరతను గుర్తించి, అదనపు పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు.
ప్రతీ జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్) ఆఫీస్లను బలోపేతం చేయాలని చెప్పారు. పేషెంట్ల సమస్యలు, లోటుపాట్లను క్షేత్రస్థాయిలో తక్షణమే పరిష్కరించే బాధ్యతను జిల్లా స్థాయి అధికారులకే అప్పగించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి, జీఏడీ స్పెషల్ సెక్రటరీ మహేశ్ దత్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ ముషారఫ్ అలీ, ఆస్కి డైరెక్టర్ సుబోధ్ తదితరులు పాల్గొన్నారు.
