హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బీఏటీ) ఆధ్వర్యంలో, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) సహకారంతో గచ్చిబౌలిలోని కోటక్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (కేపీజీబీఏ)లో నిర్వహించిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ మెన్స్ టైటిల్‌ను తుషార్ సువీర్ గెలుచుకున్నాడు. ఫైనల్లో తుషార్ 15–21, 21–18, 21–19తో భరత్ రాఘవ్‌పై నెగ్గాడు. విమెన్స్ సింగిల్స్ టైటిల్ ఫైట్‌లో రక్షిత శ్రీ సంతోష్ రామరాజ్ 16–21, 21–15, 21–14తో రుజులా రాముపై గెలవగా, మెన్స్ డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్ గరగ–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ 21–12, 21–18తో సాయి ప్రతీక్–రూబన్ కుమార్‌ను ఓడించారు.
విమెన్స్ డబుల్స్‌లో జపాన్ జోడీ మెయ్ సుడో–మై తనబే 21–11, 21–11తో థాయ్‌లాండ్ ప్రత్యర్థులపై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో రోడియన్ అలిమోవ్–అలీనా డావ్లెటోవా 19–21, 21–11, 21–13తో సతీష్ కుమార్–అశ్విని పొన్నప్పను ఓడించారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, వీసీ అండ్ ఎండీ ఏ. సోనిబాలా దేవి, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరనాథ్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి కనూరి వంశీధర్ హాజరయ్యారు.
