న్యూఢిల్లీ: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ప్రెసిడెంట్ పీటీ ఉషకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం జరిగిన ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ మెరిట్ (ఎస్వోఎమ్) ఎన్నికల్లో ఆమె ఓడిపోగా, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ విజయం సాధించింది. లెజెండరీ లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్, మాజీ ఆర్చర్ డోలా బెనర్జీ, హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ ఎస్వోఎమ్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎస్వోఎమ్లో మొత్తం 80 మంది (40 మెన్స్, 40 విమెన్స్)ని సభ్యులు నలుగురు మహిళా అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటు వేశారు.
ఇప్పటికే మెన్స్లో గగన్ నారంగ్, విజేందర్ సింగ్, యోగేశ్వర్ దత్, కమలేష్ మెహాతా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఐవోఏ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థి ఎస్వోఎమ్ ప్రతినిధిగా లేదా జనరల్ అసెంబ్లీ సభ్యుడిగా ఉండాలి. 2022లో ఉష.. ఎస్వోఎమ్ కోటాలోనే ఐవోఏ తొలి విమెన్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇప్పుడు ఓడిపోవడంతో డిసెంబర్ 5న జరగనున్న ఐవోఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం ప్రశ్నార్థకంగా మారింది. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) ద్వారా జనరల్ అసెంబ్లీకి నామినేట్ అయితేనే ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. కానీ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) నుంచి ఆమెకు ఆ అవకాశం దక్కడం కష్టమేనని తెలుస్తోంది.
