ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుగా నిలిచారు. జెన్సన్ హువాంగ్‌తో తాను ఫోన్లో మాట్లాడిన ట్రంప్.. అతనితో సంబంధం ఉన్న అలిస్ హువాంగ్ అనే మహిళ చైనా గూఢచారి అని తనకు అసలు తెలియదని జెన్సన్ హువాంగ్ స్పష్టం చేసినట్లు ట్రంప్ వైట్‌హౌస్‌లో మీడియాతో చెప్పారు. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ స్వయంగా అంగీకరించి, ఈ ఘటనపై తన కుటుంబానికి, ఎన్విడియా ఉద్యోగులకు ఆయన క్షమాపణలు కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ (FBI) దర్యాప్తు జరుపుతున్నప్పటికీ, జెన్సన్ హువాంగ్‌కు ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని, ఆయన గొప్ప వ్యక్తి అని ట్రంప్ అభివర్ణించారు. ఎన్విడియా బోర్డు కూడా ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది.
ఏంటీ వివాదం..
ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌కు, సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ (Megaspeed International) అనే డేటా సెంటర్ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ అలిస్ హువాంగ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణనలు వచ్చాయి. అలిస్ హువాంగ్ను చైనాకు చెందిన ప్రధాన గూఢచార సంస్థ రిక్రూట్ చేసుకుందని, అమెరికాకు చెందిన అత్యంత విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్ టెక్నాలజీని సేకరించడానికి, చిప్ ఎగుమతులపై ఆంక్షలను సడలించేలా ఎన్విడియా సీఈఓ ద్వారా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆమె ప్రయత్నించిందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
మెగాస్పీడ్ సంస్థ ఎన్విడియా నుంచి సుమారు 2 బిలియన్ల డాలర్ల విలువైన ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసింది. ఈ సంస్థ ద్వారా అధునాతన నిషిద్ధ చిప్‌లను చైనాకు అక్రమంగా తరలించారనే కోణంలో కూడా అమెరికా వాణిజ్య శాఖ విచారణ జరిపింది.ఈ వ్యవహారంపై అమెరికా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FBI విచారణ జరుపుతోందని ట్రంప్ అన్నారు. అయితే హువాంగ్‌కు ఎలాంటి సమస్య రాదని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ వ్యవహారంలో జెన్సెన్ హువాంగ్ తన తప్పును అంగీకరించారు. తాను తన భార్యకు నమ్మకద్రోహం చేశానని, కంపెనీ ఉద్యోగులకు ,కుటుంబానికి క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ రాశారు. విదేశీ నిఘా సంస్థలు హువాంగ్ను టార్గెట్ చేశాయా అనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపడానికి ఎన్విడియా బోర్డు ఓ కమిటీని కూడా వేసింది. కంపెనీ రహస్యాలు గానీ, జాతీయ భద్రత గానీ ప్రమాదంలో పడలేదని ఎన్విడియా ప్రాథమికంగా నిర్ధారించింది.
ఖండించిన చైనా..
ఈ ఆరోపణలను చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ చైనా ప్రతిష్టను దెబ్బతీసేందుకు అమెరికా కల్పిత ఆరోపణలని కొట్టిపారేసింది. మరోవైపు ఈ వివాదం బయటకు రావడంతో ఎన్విడియా షేర్లు దాదాపు 4శాతం పైగా పతనమై, 7 నెలల కనిష్టానికి పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 250 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.
