- ముందుజాగ్రత్తగా అధికారుల ఆంక్షలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. లఫాయెట్ స్క్వేర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఒక కారు అకస్మాత్తుగా అడ్డుకట్టను దాటి అక్కడి రోడ్డు పక్కన ఉన్న సైన్‌బోర్డ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారులో నుంచి తెల్లటి పొగలు రావడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బోర్డును ఢీకొట్టిన డ్రైవర్ వాహనం దిగి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులు, నేషనల్ గార్డ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైట్‌హౌస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి ప్రెస్ రూమ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మీడియా ప్రతినిధులను బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌లోనే ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ ఉద్దేశం ఏంటనేదానిపై భద్రతా అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, సీక్రెట్ సర్వీస్ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది.
‘భద్రతా సిబ్బందితో కార్ డ్రైవర్ దూకుడుగా వ్యవహరించాడు. అతడిని వెంటనే అరెస్ట్ చేశాం’ అని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి వెల్లడించినట్లు పేర్కొంది. ప్రమాదానికి గురైన కారులోని రెండో వ్యక్తి లాఫయెట్ పార్క్ వాయవ్య మూలలో బారికేడ్ దాటి లోపలికి దూకడంతో అతడిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా కారును పరీక్షించేందుకు ఎంపీడీ ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ టీమ్‌ను పిలిపించినట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాల కోసం డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించామన్నారు. లాఫయెట్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్లను అప్రమత్తత కోసం మూసివేశామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
