ఎన్నికల వరకే రాజకీయాలు..కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే

ఎన్నికల వరకే రాజకీయాలు..కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే
  • అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్త : బండి సంజయ్
  • కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే
  • కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం బీజేపీలోనే సాధ్యం
  • లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లతోనే 
  • నాకు ఈ గుర్తింపు వచ్చిందని వెల్లడి
  • కేంద్ర మంత్రి సంజయ్​కు కరీంనగర్​లో ఘనస్వాగతం 

కరీంనగర్, వెలుగు: ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత పూర్తిగా తెలంగాణ, కరీంనగర్ అభివృద్ధి కోసమే పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ అన్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అందరిని కలుపుకుని అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కరీంనగర్​కు వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. ఆయన కరీంనగర్ కు చేరుకోగానే నేలకు సాష్టాంగ నమస్కారం చేశారు. కరీంనగర్ లో మహాశక్తి ఆలయం, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, నల్గొండ లక్ష్మీనర్సింహాస్వామి, సిరిసిల్లలోని మార్కండేయ ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయ ఆవరణలో మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ, తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం కరీంనగర్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్షేనని అన్నారు. కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడేటప్పుడు తనతోపాటు కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నారని, కేసుల పాలయ్యారని గుర్తు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో తనతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ కష్టాలను లెక్క చేయకుండా 155 రోజులపాటు 1600 కిలోమీటర్లకుపైగా నడిచారని, అందుకే ఈ పదవిని ప్రజలకు, కార్యకర్తలకే అంకితమిస్తున్నానని పేర్కొన్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగానంటే.. ఇది కేవలం బీజేపీవల్లే సాధ్యమైందన్నారు. 

అమ్మవారి ఆశీస్సులతోనే సాధ్యమైందని తెలిపారు. కార్యకర్తలు తన పక్షాన ఉండకుంటే.. లాఠీదెబ్బలు తినకుంటే, జైలుకు వెళ్లకుంటే ఈ గుర్తింపు వచ్చేది కాదని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి పదవి అధికారం కోసమో, పదవులు అనుభవించడానికో.. అక్రమంగా సంపాదించుకోవడానికో కాదని, దేశ రక్షణ, ధర్మ రక్షణ, సమాజ సంఘటితం కోసం.. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ పదవిని ఉపయోగిస్తానని తెలిపారు. గురువారం కిషన్ రెడ్డి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళుతున్నట్లు చెప్పారు. ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.

దేవుడికే శఠగోపం పెట్టిన చరిత్ర కేసీఆర్​ది 

ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజన్న ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని సంజయ్ వెల్లడించారు. దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి జరుగుతుందనడానికి కేసీఆర్ ప్రభుత్వమే నిదర్శనమన్నారు. రూ.4 వందల కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి దేవుడికే శఠగోపం పెట్టిన చరిత్ర కేసీఆర్ సర్కార్ దేనన్నారు. రాజన్న ఆలయ దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ వేములవాడకు వచ్చి ఇక్కడి ప్రజల అభిమానానికి ముగ్దులయ్యారని తెలిపారు. 43 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చిన ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.