డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు?

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు?

సీఎం  కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించారు. డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. కొన్ని రోజులుగా కేసీఆర్‌కు బండి సంజ‌య్‌ వ‌రుస‌గా లేఖ‌లు రాస్తున్నారు. ఈవాళ(బుధవారం) డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఆయ‌న లేఖ రాశారు. కేసీఆర్ సారు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు?  అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై అనేక ప్ర‌శ్న‌లు సంధించారు.

 
2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు మీరు అనేక హామీలు ఇచ్చారు. ఇందులో ఎన్ని అమలు చేశారు? ఎన్ని అమలు చేయలేదు? దీనిపై చర్చించడానికి మీరు సిద్ధమేనా?


..ఇరుకైన ఇంట్లో ఆలుమగలు కాపురం చేయడమే కష్టం..అల్లుడు బిడ్డా వస్తే తలదాచుకునేదెలా..? గత ప్రభుత్వాలు ఇరుకైన ఇండ్లు పేదలకు ఇచ్చింది..  టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తాం.. అని 2014, 2018 ఎన్నికల ప్రచారసభల్లో మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా..?


..అల్లుడు, బిడ్డ వస్తే ఏడ పండుకోవాలె, అందుకే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్త, ఇక్కడే కుర్చీ వేసుకొని 4 నెలల్లో పూర్తి చేయిస్తా, అప్పుడు వస్తే నాకు కోడిని కోయాలి, కల్లు తేవాలే, దావత్ ఇవ్వాలే అంటూ మీరు జనవరి 11, 2015న వరంగల్లో హామీ ఇచ్చారు. ఈ హామీ మీకు గుర్తుందా? ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు కట్టించారు? మీకు ప్రజలు దావత్ ఇచ్చారా? కల్లు తాపారా?


..కేసీఆర్ సారూ... అల్లుడు, బిడ్డ వస్తే ఏడ పండుకోవాలే? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు? మీరిచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తరు?

..2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేజీ 14లో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనే అంశం కింద ‘‘ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని మీరు హామీ ఇచ్చారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు? ఎన్ని పేదలకు ఇచ్చారు? వీటికి లెక్కలు చెప్పగలరా?


..2018 ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి 6 లక్షల వరకు అందించడం జరుగుతుందని మీరు హామీ ఇచ్చారు. ఇండ్ల నిర్మాణం కోసం కనీసం ఒక్కరికైనా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందా?


..ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 91 వేల ఇండ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేస్తే, అందులో ఎన్ని ఇండ్లను పూర్తి చేశారు? వాటి వివరాలను ఇవ్వగలరా?


..డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం మొత్తం ఎన్నిదరఖాస్తులు వచ్చాయి?అందులో అర్హత ఉన్నవి ఎన్ని? వాటి వివరాలు ఇవ్వగలరా?


..ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద గ్రామీణ,పట్టణాలలోఇండ్లు పొందడానికి అర్హత ఉన్నలబ్ధిదారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రప్రభుత్వానికి సమర్పించడంలేదు? ఇందులో ఏమైనా మతలబుఉందా?


..కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిన 2.91 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తిచేస్తే... తెలంగాణలో పేదల కోసం మరో 10 లక్షల ఇండ్లు కేంద్రం నుండి మంజూరు చేయించే బాధ్యత బిజెపి తెలంగాణ శాఖది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 2.91 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని  సత్వరమే పూర్తి చేస్తామని మీరు హామీ ఇవ్వగలరా?


..వందల కోట్ల రూపాయలతో మీరు ఇంద్రభవనం లాంటి ప్రగతి భవన్ ను సంవత్సర కాలంలోనే నిర్మించుకున్నారు.మీరు 2014లో నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారమే 26.31 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు రాష్ట్రంలో ఉన్నారు. 7 ఏళ్లు పూర్తవుతున్నా వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోతున్నారు? పేదల పట్ల మీకున్న ప్రేమ ఇదేనా?


..రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు? ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి? అఖిలపక్ష నేతలను తీసుకెళ్లి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చూపించే దమ్మూ ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా?


..డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఈ 7 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత? ఖర్చు చేసిందెంత? కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులెన్ని? వీటి వివరాలను అందించగలరా?

..గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు..? మిగితా 116 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు?
బాధ్య‌గ‌ల పార్టీగా ప్ర‌జ‌ల ప‌క్షాన బీజేపీ త‌ర‌ఫున రేపు మ‌రిన్ని ప్ర‌శ్న‌లు అడుగుతాన‌ని ఆయ‌న చెప్పారు.