TRS ప్రభుత్వం హిందూ వ్యతిరేకిగా వ్యవహరిస్తోంది

TRS ప్రభుత్వం హిందూ వ్యతిరేకిగా వ్యవహరిస్తోంది

హైదరాబాద్ జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయం సంఘటనలో 15 మంది సాధువులను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఇది ముమ్మాటికి హిందూ మతంపై దాడేనని ఆరోపించారు. దీనికి సంబంధించి పత్రిక ప్రకటన విడుదల చేసిన బండి సంజయ్.. సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కరించాలన్నారు. 

TRS ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు  సాధువుల అరెస్టులకు పాల్పడ్డారని పత్రిక ప్రకటన ద్వారా విమర్శించారు బండి సంజయ్. శాంతియుత జీవితం గడిపే సాధువులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. భూవివాదాన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ నాయకులు వెనక ఉండి ఈ కూల్చివేత తతంగాన్ని నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వ, నిరంకుశంగా వ్యవహరిస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై, జర్నలిస్టులపై, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులకు పాల్పడబోతుందన్నారు. చివరకు రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం పనిచేస్తూ.. దైవ చింతనలో గడిపే సాధువులను కూడా వదిలిపెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. 

15 మంది సాధువుల అరెస్టును హిందూ సమాజంపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు బండి సంజయ్. TRS ప్రభుత్వం హిందూ వ్యతిరేకిగా వ్యవహరిస్తోందన్నారు.ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థన స్థలాలపై చర్యలు తీసుకోవడానికి సంకోచించే ఈ ప్రభుత్వం.. హిందూ ఆలయాలపై మాత్రం బలగాలను అడ్డుపెట్టుకొని కూల్చివేతలకు పాల్పడుతోందంటూ పత్రికా ప్రకటనలో తెలిపారు.అరెస్టులతో సమస్యను పరిష్కరించలేమని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా సమస్యను శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానంటూ పత్రిక ప్రకటనలో తెలిపారు బండి సంజయ్ .