- క్వాలిఫయర్–1లో 92 రన్స్ తేడాతో గుజరాత్‌పై విజయం
- చెలరేగిన రజత్, క్రునాల్, కోహ్లీ
- టైటాన్స్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాఫ్
- క్వాలిఫయర్–2కు గుజరాత్
ధర్మశాల: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రజత్ పటీదార్ (33 బాల్స్‌లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93 నాటౌట్), క్రునాల్ పాండ్యా (28 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), విరాట్ కోహ్లీ (25 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) దంచికొట్టడంతో మంగళవారం జరిగి న క్వాలిఫయర్–1లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు 92 రన్స్ తేడాతో గుజరాత్‌పై గెలిచింది. టాస్ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 254/5 స్కోరు చేసింది. తర్వాత గుజరాత్ 19.3 ఓవర్లలో 162 రన్స్‌కే ఆలౌటైంది. రాహుల్ తెవాటియా (68) టాప్ స్కోరర్. రజత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
- మెరిసిన రజత్, పాండ్యా
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును కట్టడి చేయడంలో జీటీ బౌలర్లు ఫెయిలయ్యారు. తొలి రెండు ఓవర్లలో వెంకటేశ్ అయ్యర్ (19) మూడు ఫోర్లు, ఓ సిక్స్ దంచి వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు 21 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇక్కడినుంచి కోహ్లీ, దేవదత్ పడిక్కల్ (30) బౌండ్రీలతో రెచ్చిపోయారు. నాలుగో ఓవర్‌లో ఇద్దరు కలిసి నాలుగు ఫోర్లు రాబట్టారు. ఆరో ఓవర్‌లో కోహ్లీ 4, 4, 6 దంచడంతో పవర్‌ప్లేలో ఆర్సీబీ 76/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత ఈ ఇద్దరు సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. కానీ 9వ ఓవర్‌లో హోల్డర్ (2/39) బెంగళూరుకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాలో కోహ్లీ, పడిక్కల్‌ను ఔట్ చేసి షాకిచ్చాడు. రెండో వికెట్‌కు 72 రన్స్ జత కావడంతో స్కోరు 94/3గా మారింది. అదే క్రమంలో 99/3తో తొలి పది ఓవర్లను ముగించింది.
ఇక్కడి నుంచి రజత్ పటీదార్, క్రునాల్ పరుగుల వేగాన్ని మరో మెట్టు ఎక్కించారు. 11వ ఓవర్‌లో పటీదార్ 6, 4 కొట్టగా తర్వాతి ఓవర్‌లో పాండ్యా రిపీట్ చేశాడు. 14వ ఓవర్‌లో రెండు ఫోర్లు వచ్చాయి. 15వ ఓవర్‌లో పాండ్యా 4, 4, పటీదార్ 6, 6తో 28 రన్స్ దంచడంతో స్కోరు 168/3గా మారింది. రషీద్ వేసిన 16వ ఓవర్‌లో పాండ్యా మూడు సిక్స్‌లు కొట్టి తర్వాతి ఓవర్‌లో రబాడ (2/54)కు వికెట్ ఇచ్చాడు. ఫలితంగా నాలుగో వికెట్‌కు 95 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఇదే ఓవర్‌లో సిక్స్‌తో పటీదార్ 21 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో టిమ్ డేవిడ్ (4) నిరాశపర్చాడు. 18వ ఓవర్‌లో ప్రసిధ్ కృష్ణ (1/53)కు వికెట్ ఇచ్చాడు. ఐదో వికెట్‌కు 25 రన్స్ జతయ్యాయి. 19వ ఓవర్‌లో పటీదార్ 6, 4, జితేష్ శర్మ (15 నాటౌట్) 4, 6తో 21 రన్స్ వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో పటీదార్ 6, 6తో 19 రన్స్ చేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది.
- చివర్లో మెరుపులు..
భారీ ఛేజింగ్‌లో గుజరాత్‌ను కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు సూపర్ సక్సెస్ అయ్యారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో జీటీ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. స్టార్టింగ్‌లోనే నాలుగు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన సుదర్శన్ (14) మూడో ఓవర్‌లో దురదృష్టవశాత్తు హిట్ వికెట్ అయ్యాడు. ఇక్కడినుంచి మొదలైన వికెట్ల పతనానికి ఎక్కడా బ్రేక్ పడలేదు. వన్‌డౌన్‌లో బట్లర్ (29) 4, 6తో ఖాతా తెరిచినా.. నాలుగో ఓవర్‌లో గిల్ (2) వెనుదిరిగాడు. దాంతో జీటీ 27/2తో కష్టాల్లో పడింది. నిశాంత్ సింధు (5) ఫోర్ కొట్టినా.. ఐదో ఓవర్‌లో 4, 6, 4 దంచి బట్లర్ ఔటయ్యాడు. ఆరో ఓవర్‌లో రసిక్ సలామ్ (2/24).. నాలుగు బాల్స్ తేడాలో నిశాంత్, హోల్డర్ (0) వికెట్లు తీసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జీటీ 51 రన్స్‌కే సగం వికెట్లు కోల్పోయింది.
వాషింగ్టన్ సుందర్ (8), రాహుల్ తెవాటియా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వికెట్లను కాపాడుకునే ప్రయత్నం చేసి ఫెయిలయ్యారు. 9వ ఓవర్‌లో హాజిల్‌వుడ్ (2/28) దెబ్బకు సుందర్ పెవిలియన్‌కు వచ్చాడు. స్కోరు 65/6గా మారింది. పది ఓవర్లలో 70/6తో గుజరాత్ 11వ ఓవర్‌లో రషీద్ ఖాన్ (8) వికెట్ కోల్పోయింది. తర్వాతి ఓవర్‌లోనే రబాడ (9) కూడా ఔట్ కావడంతో 88/8 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక్కడి నుంచి తెవాటియా నిలకడగా 33 బాల్స్‌లో ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో సిరాజ్ (5)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 68 రన్స్ జోడించి వెనుదిరిగాడు. లాస్ట్ ఓవర్‌లో సిరాజ్ కూడా ఔట్ కావడంతో గుజరాత్‌కు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 254/5 (రజత్ 93*, క్రునాల్ 43, విరాట్ 43, హోల్డర్ 2/39).
గుజరాత్: 19.3 ఓవర్లలో 162 ఆలౌట్ (రాహుల్ 68, బట్లర్ 29, డఫీ 3/39).
వరుసగా నాలుగు సీజన్లలో 600లకు పైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్ విరాట్ కోహ్లీ. గేల్, వార్నర్, కేఎల్ రాహుల్ మూడు సీజన్లలో ఆరు వందలకు పైగా రన్స్ చేశారు.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి బ్యాటర్ విరాట్ కోహ్లీ (282), రోహిత్ శర్మ (281)ను అధిగమించాడు.
అత్యధిక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఆడిన నాలుగో ప్లేయర్ కోహ్లీ (18). ధోనీ (28), అశ్విన్ (24), రైనా (24) ముందున్నారు.
