బాసర ట్రిపుల్ ఐటీలో ఐదుగురు స్టూడెంట్స్ కి అస్వస్థత

బాసర ట్రిపుల్ ఐటీలో ఐదుగురు స్టూడెంట్స్ కి అస్వస్థత

నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో విద్యార్థులు ఉత్తప్ప తిన్నారు. అనంతరం వాంతులు, కడుపునొప్పి, తలనొప్పితో బాధపడుతున్న ఐదుగురు విద్యార్థులు అనారోగ్యంతో ట్రిపుల్ ఐటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతన్నారని వైద్యులు తెలిపారు. 

కొన్నాళ్లుగా బాసర ట్రిపుల్ ఐటీని సమస్యలు వెంటాడుతున్నాయి. నెల రోజుల కింద బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటన విద్యార్థుల ఆందోళనకు దారి తీసింది. వారం రోజులు పాటు విద్యార్థులు ఎండా, వాన లెక్క చేయకుండా నిరసన తెలిపారు. తర్వాత మంత్రి సబితాఇంద్రారెడ్డి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి మాటిచ్చి 20రోజులు గడిచిపోయినా సమస్యలు పరిష్కారం కాలేదు. మొన్నటికి మొన్న విద్యార్థులు మరోసారి ఆందోళన చేస్తామనడంతో.. హడావుడిగా మెస్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేశారు ట్రిఫుల్ ఐటీ అధికారులు. 

రాష్ట్ర ప్రభుత్వం, ట్రిఫుల్ ఐటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఎంతసేపు నోటీమాటలు, హామీలతోనే సరిపెడుతున్నారని.. సమస్యల పరిష్కారాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. తిండిసరిగ్గా లేక..వసతులు లేక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యహరిస్తుందని మండిపడుతున్నారు. పర్మినెంట్ వీసీని నియమించి.. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు బాసర ట్రిఫుట్ ఐటీ విద్యార్థులు.