
కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై ఎన్నికయ్యారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే బీజేపీ పరిశీలకులుగా వెళ్లిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రదాన్ మొగ్గు చూపారు. దీనికి సంబంధించి ఇవాళ(మంగళవారం) బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా బసవరాజును ఎన్నుకున్నారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించారు. ఆయన రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మాజీ సీఎం RS బొమ్మై కుమారుడే బసవరాజు. జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. సీఎం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు విన్పించినా.. చివరకు బసవరాజు బొమ్మై నే సీఎంగా ఎన్నుకున్నారు. గతంలో టాటా గ్రూప్‌లో ఇంజనీర్‌గా బసవరాజు పని చేశారు.