- యువతలోని సృజనాత్మకతను వెలికితీస్తం: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను యువ ఫిలిం మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, సెట్విన్ మాజీ చైర్మన్ గిరిధర్ రెడ్డిలతో కలిసి ఛాలెంజ్ పోస్టర్‌ను హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ ఛాలెంజ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
షార్ట్ ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఛాలెంజ్ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛాలెంజ్‌ను విజయవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.
